Zomato News: జొమాటోలో నయా ఫీచర్.. చిల్లర కష్టాలకు చెల్లుచీటి.. బిగ్‌బాస్కెట్‌పై దీపిందర్ ప్రశంసలు
Zomato New feature: సీజన్‌తో సంబంధం లేకుండా దూసుకుపోతున్న కంపెనీలు ఉన్నాయంటే అవి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్తలేనని ఇట్టే చెప్పేయొచ్చు. అంతగా మన రోజువారి జీవితంలో అవి భాగం అయిపోయాయి. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని, సరికొత్త హంగులతో అందిస్తూ ప్రజల ఆకలి తీరుస్తున్నాయి. తాజాగా కస్టమర్లను వేధిస్తున్న ఓ సమస్యకు జొమాటో సొల్యూషన్ తీసుకొచ్చింది.
ఇకపై డెలివరీ ఏజెంట్లు, కస్టమర్ల చిల్లర కష్టాలకు జొమాటో బ్రేక్ వేసింది. క్యాష్ ఆన్ డెలివరీ అనంతరం చిల్లర కోసం పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కీలక పరిష్కారం చూపింది. డెలివరీ ఏజెంట్ వద్ద తిరిగిచ్చేందుకు చిల్లర లేని పక్షంలో సదరు మొత్తాన్ని జొమాటో మనీ అకౌంట్ లో యాడ్ చేయమని కోరే ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు CEO దీపీందర్ గోయల్ X వేదికగా పోస్ట్ చేశారు.

అయితే ఇది తమ సొంత ఆలోచన కాదని నిర్మొహమాటంగా చెప్పిన విధానం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ప్రముఖ టాటా గ్రూప్ కు చెందిన బిగ్ బాస్కెట్ నుంచి ప్రేరణ పొంది ఈ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ఇందుకుగాను ఆ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఇలా ఇన్స్టెంట్ క్రెడిట్ ఆప్షన్ పై వినియోగదారులు సానుకూలంగా స్పందిస్తున్నారు. కస్టమర్లను అనుభూతిని మెరుగుపరిచేందుకు జొమాటో తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తున్నారు.
15 ఏళ్ల క్రితం చిన్న కంపెనీగా ప్రస్థానం మొదలుపెట్టి వేలకోట్ల టర్న్ ఓవర్ కలిగిన సంస్థగా జొమాటో నిలిచింది. మరోవైపు సంస్థ వ్యవస్థాపకులు దీపీందర్ గోయల్ ఇటీవలే బిలియనీర్ల జాబితాలో చేరారు. ప్రస్తుతం కంపెనీలో 4 శాతానికి పైగా ఆయనకు వాటా ఉంది. కేవలం ఉన్న వ్యాపారంతో సరిపెట్టుకోకుండా ఎప్పటికప్పుడు వినియోగదారులకు కొత్తదనం అందిస్తూ అభివృద్ధి బాటలో జొమాటోను పరుగులు పెట్టిస్తున్నారు. భవిష్యత్తులనూ యాప్ లో ఇలాంటి మరిన్ని సౌకర్యాలు కల్పించాలని యూజర్లు కోరుతున్నారు.


Click it and Unblock the Notifications