Zomato సంచలన నిర్ణయం.. ఇక ఈ ఫుడ్ ఐటమ్స్ మీకు ఇక కనిపించవు.. 250 మంది ఉద్యోగులు ఔట్..
ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం 'జొమాటో' (Zomato) తమ ప్లాట్‌ఫామ్‌లో ఆహార నాణ్యతను పెంచేందుకు, వినియోగదారుల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. తమ యాప్‌లో అనలాగ్ పాల ఉత్పత్తులతో (కల్తీ లేదా కృత్రిమ పాల మిశ్రమాలు) తయారు చేసే వంటకాలను విక్రయించడాన్ని తక్షణమే నిషేధిస్తున్నట్లు సంస్థ అధికారిక పత్రికా ప్రకటనలో వెల్లడించింది.
అనలాగ్ ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు ప్రకటించిన రెస్టారెంట్ భాగస్వాముల వంటకాలను ప్లాట్‌ఫామ్ నుండి ఇప్పటికే తొలగించినట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎటువంటి అలసత్వాన్ని సహించేది లేదని, నిబంధనలను ఉల్లంఘించే రెస్టారెంట్ల లిస్టింగ్‌లను తొలగించే పూర్తి హక్కు తమకు ఉందని హెచ్చరించింది. వినియోగదారులకు మెరుగైన, స్వచ్ఛమైన ఆహారాన్ని అందించడమే తమ ప్రధాన ధ్యేయమని, పారదర్శకత మరియు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగానే ఈ కఠిన చర్యలు తీసుకున్నామని జొమాటో సీఈఓ ఆదిత్య మంగ్లా తెలిపారు.

రెస్టారెంట్ భాగస్వాములకు జొమాటో మార్గదర్శకాలు:
ఆహార నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని కోరుతూ తమ రెస్టారెంట్ భాగస్వాములకు జొమాటో ఈ క్రింది సూచనలు చేసింది:
సహజ ఉత్పత్తుల వినియోగం: అనలాగ్ పదార్థాలకు స్వస్తి చెప్పి వెంటనే సహజమైన పాల ఉత్పత్తులకు మారాలి.
మెనూ నుండి తొలగింపు: ఒకవేళ తక్షణ మార్పు సాధ్యం కాకపోతే, అనలాగ్ పాల ఉత్పత్తులు కలిగిన వంటకాలను మెనూ జాబితా నుండి వెంటనే తొలగించాలి.
ప్రామాణిక తనిఖీ: సరఫరాదారులు అందించే ఉత్పత్తి లేబుళ్లు మరియు పదార్థాల వివరాలను సమగ్రంగా సమీక్షించి, జొమాటోలో సరైన సమాచారాన్ని మాత్రమే పొందుపరచాలి. నిబంధనలను పాటించని రెస్టారెంట్లను తమ ప్లాట్‌ఫామ్ నుండి శాశ్వతంగా తొలగిస్తామని కంపెనీ స్పష్టం చేసింది.
హైదరాబాద్‌లో కస్టమర్ సపోర్ట్ యూనిట్ మూసివేత - 250 మంది ఉద్యోగాలు ఖాళీ
మరో కీలక పరిణామంలో.. జొమాటో తమ కస్టమర్ కేర్ విభాగానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని తన కస్టమర్ సపోర్ట్ కార్యకలాపాలను జొమాటో పూర్తిగా మూసివేసినట్లు సమాచారం. ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం.. హైదరాబాద్ యూనిట్ మూసివేత కారణంగా దాదాపు 250 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. గత ఆరు నెలలుగా జొమాటో తమ కస్టమర్ సపోర్ట్ సేవలను బాహ్య భాగస్వాములకు (Outsourcing) అప్పగించే వ్యూహాత్మక మార్పులు చేస్తోందని, అందులో భాగంగానే ఈ లేఆఫ్స్ చోటుచేసుకున్నాయని నివేదిక పేర్కొంది.


Click it and Unblock the Notifications
