హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కాలు బయటపెట్టాలంటనే నగరవాసులు వణికిపోతున్నారు. ఇక ఫుడ్ డెలివరీ ఇచ్చే డెలివరీ బాయ్స్ పరిస్ధితి దారుణంగా ఉంది. పనిచేయనిదే పూట గడవక పోవడంతో వారు జోరు వానలో కూడా డెలివరీ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో ఓ జొమాటో డెలివరీ రైడర్ తెరిచి ఉన్న డ్రెయిన్‌లో పడిపోవడంతో తృటిలో ప్రాణాలతో బయటపడిన ఘటన చోటు చేసుకుంది. ఆగస్టు 9 రాత్రి 9:30 ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సయ్యద్ ఫర్హాన్ అనే Zomato రైడర్..భారీ వర్షంలో ఆర్డర్ డెలివరీ చేస్తూ టికెఆర్ కమాన్ ప్రాంతంలో ఓపెన్ డ్రెయిన్‌లో పడిపోయాడు. వరదనీటి వేగానికి అతని బైక్, మొబైల్ ఫోన్ కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలో.. ఫర్హాన్ నీటిలో చిక్కుకుని తాడు పట్టుకుని బయటపడేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కన్పిస్తున్నాయి. సమీపంలోని స్థానికుకులు ధైర్యంగా ముందుకొచ్చి.. మొదట బైక్‌ను బయటకు లాగి.. తర్వాత ఫర్హాన్‌ను సురక్షితంగా బయటకు తీసారు. అదృష్టవశాత్తూ అతను ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు.

ఈ ఘటనపై తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) తీవ్రంగా మండిపడింది. యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూజజ ఇది కేవలం ప్రమాదం కాదు.. కంపెనీలు కార్మికుల భద్రత కంటే లాభాలకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. నిన్న ఫర్హాన్ అదృష్టవశాత్తూ బతికాడు. కానీ రేపు మరొక రైడర్‌కు ఇదే పరిస్థితి ఎదురైతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
TGPWU, ఫర్హాన్ కోల్పోయిన మొబైల్ ఫోన్‌ను జొమాటో భర్తీ చేయాలని.. వరదలో దెబ్బతిన్న బైక్‌ను రిపేర్ చేయాలని.. కోల్పోయిన ఆదాయానికి సరైన పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది రూ. 10-రూ.15 వర్షపు బోనస్ విషయం కాదు.. రైడర్ సజీవంగా ఇంటికి చేరుతాడా లేదా అనేది ముఖ్యమని తెలిపారు.
రైడర్ల ప్రాణాలను ప్రమాదంలో పెట్టే కంపెనీలపై చర్యలు తీసుకోవాలని GHMCకి యూనియన్ విజ్ఞప్తి చేసింది. అగ్రిగేటర్లకు తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో డెలివరీలను నివారించమని GHMC సలహాలు ఇచ్చినప్పటికీ ఆ హెచ్చరికలను అనేక కంపెనీలు పట్టించుకోవడం లేదని TGPWU ఆరోపించింది. డెలివరీ వర్కర్ల కోసం రియల్-టైమ్ వాతావరణ హెచ్చరికలు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు డెలివరీలను నిలిపివేయడం ద్వారా, ప్రాణ నష్టం నివారించవచ్చని యూనియన్ స్పష్టం చేసింది.
ఈ ఘటన వీడియో బయటకు రావడంతో.. జొమాటోపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కేవలం ఆర్డర్ డెలివరీ కోసం రైడర్లను ప్రాణాలను పణంగా పెట్టించడం సరికాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.


Click it and Unblock the Notifications