రోజూ 14 గంటల కష్టపడుతున్నా రూ. 500 కూడా రావడం లేదని జొమాటో డెలివరీ బాయ్స్ భోరున విలపిస్తూ రోడ్డెక్కారు. హైదరాబాద్ నగర వీధుల్లో ఎండ, వాన, చలి లెక్క చేయకుండా ఫుడ్ డెలివరీ చేస్తున్నామని అయినా..మాకు రూ. 500 కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఉప్పల్ లో జొమాటో డెలివరీ బాయ్స్ రోడ్డెక్కి దీనిపై నిరసనకు దిగారు. దీనికి కంపెనీ యాజమాన్యం కారణమని ఆరోపిస్తున్నారు. డెలివరీ టారిఫ్‌లు సరైన విధంగా చెల్లించడం లేదన్న ఆవేదనతో రోడ్డెక్కామని వారు చెబుతున్నారు. ఉప్పల్ ప్రాంతంలో పెద్దఎత్తున నిరసన బయటకు వచ్చి నిరసన తెలిపారు.
గత ఐదు, ఆరు సంవత్సరాలుగా సంస్థలో పనిచేస్తున్నామని.. రాత్రి తడవక, పగలు ఎండనకా పని చేస్తున్నామని తెలిపారు.అయినా రోజుకు 12 నుంచి 14 గంటలు పనిచేస్తున్నా కనీసం రూ.500 కూడా రావడం లేదని వాపోతున్నారు. వర్షాలు సమయంలో కస్టమర్ల నుంచి వసూలు చేసే Rain Delivery Charge లు కంపెనీ తీసుకుంటోందని ప్రశ్నిస్తున్నారు. వానలో తడుస్తూ డెలివరీ చేసే మమ్మల్ని పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. వాళ్లకి డబ్బులు.. మాకు మాత్రం కష్టం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డెలివరీ చేయడం కేవలం ఫుడ్ మాత్రమే కాదని..ట్రాఫిక్, కాలుష్యం, ప్రమాద భయం, శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి అన్నీ కలిపి ఇది ఒక రిస్కీ ప్రొఫెషన్ లా తయారైందని చెప్పుకొచ్చారు. కానీ ఈవిధంగా పనిచేస్తున్న ఉద్యోగులకు కనీసం ఇన్సూరెన్స్ సదుపాయం కూడా ఇవ్వడంలేదంటూ వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో చిక్కుకుంటే వైద్య ఖర్చులు కూడా భరించలేని స్థితిలో ఉన్నామన్నారు. కంపెనీ వైపు నుండి ఒక రూపాయి కూడా వస్తుందో లేదో తెలీదంటూ ఒక డెలివరీ బాయ్ వాపోయాడు.
తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే.. పోలీస్ కేసులు పెడతామంటూ కంపెనీ యాజమాన్యం బెదిరిస్తోందని డెలివరీ బాయ్స్ ఆరోపించారు. తక్కువ డబ్బు ఇస్తున్నారు... పైగా మాట్లాడితే బెదిరిస్తున్నారు. ఇది దుర్మార్గమని మండిపడుతున్నారు. తమకు న్యాయం జరగాలని.. డెలివరీ టారిఫ్‌లు తమ ఖాతాల్లోనే జమ కావాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఫుడ్ ఆర్డర్‌కి కనీసం 25-30 శాతం టారిఫ్ కంపెనీ తీసుకుంటోంది. కానీ మాకు వచ్చే మొత్తం మాత్రం రూ.15-20 మాత్రమే. అది కూడా గంటల సమయం తర్వాత అంటూ వారు కష్టాలను వివరిస్తున్నారు.
హైదరాబాద్ వంటి బిజీ నగరంలో ట్రాఫిక్, కాలుష్యం మధ్య చిక్కుకుని పని చేయడం చిన్న విషయమేమి కాదు. పైగా టైం బౌండ్ డెలివరీ ఒత్తిడిలో వారు పడే కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వకపోవడం పట్ల సామాజిక మాధ్యమాల్లో కూడా పెద్ద ఎత్తున కంపెనీ మీద వ్యతిరేకత వ్యక్తమవుతోంది.డెలివరీ బాయ్స్ డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత కంపెనీపై ఉందని గుర్తు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications