Zomato Share: జొమాటో సీఈవో జాక్‌పాట్.. ఒక్కరోజే రూ.1,638 కోట్లు లాభపడ్డ దీపేంద్ర గోయల్
Zomato CEO: ఫుడ్ డెలివరీ స్టార్టప్ జొమాటో ప్రతి త్రైమాసికంలోనూ తన లాభదాయకతను పెంచుకుంటూ ఇన్వెస్టర్లను సంతోష పెడుతోంది. ఈ క్రమంలోనే జూన్ త్రైమాసికంలో రూ.253 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 74 శాతం పెరిగి రూ.4,206 కోట్లకు చేరినట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
వరుసగా ఐదవ త్రైమాసికంలో కంపెనీ తన లాభాల పరంపరను కొనసాగించటంతో మార్కెట్లో జొమాటో స్టాక్ చెలరేగిపోయింది. ఇన్వెస్టర్లు కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపటంతో శుక్రవారం అంటే త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన తర్వాతి రోజున స్టాక్ భారీ ర్యాలీని చూసింది. ఈ క్రమంలో కంపెనీ షేర్లు ఏకంగా 19 శాతం పెరుగుదలను చూశాయి. దీని వల్ల కంపెనీ వ్యవస్థాపకుడు సీఈవో దీపేందర్ గోయల్ కేవలం ఒక్క రోజునే రూ.1,638 కోట్ల లాభం పొందారు. కంపెనీ అద్భుత పనితీరు ఆయనకు కాసుల వర్షం కురిపించిందని చెప్పుకోవచ్చు.

త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన తర్వాత జొమాటో షేర్లు శుక్రవారం 19 శాతం పెరిగి రూ.278.45 వద్ద ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని తాకాయి. ఈ పెరుగుదల కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2.46 లక్షల కోట్లకు చేరుకుంది. అయితే మార్కెట్ల ముగింపు సమయానికి ఇన్వెస్టర్లు లాభాల బుకింగ్ కోసం చేసిన ప్రయత్నాలు షేరు ధరను కొంత తగ్గించాయి. దీంతో చివరికి కంపెనీ షేర్లు బీఎస్ఈలో రూ.262.45 వద్ద ముగిశాయి. ఒక్కరోజు స్టాక్ భారీ ర్యాలీని నమోదు చేయటం వల్ల మార్కెట్ క్యాప్ రూ.40,000 కోట్లు పెరిగింది.
అమాంతంగా జొమాటో షేర్లలో రాకెట్ పెరుగుదల కనిపించటం సీఈవో దీపేంద్ర గోయల్‌కు సైతం లాభాలను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం జొమాటో సీఈవో, షార్క్ టాంక్ ఇండియా న్యాయమూర్తి దీపేంద్ర గోయెల్ కంపెనీలో మెుత్తం 4.19 శాతం వాటాలు కలిగి ఉన్నారు. అంటే 36,94,71,500 షేర్లను హోల్డ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కంపెనీ షేర్లలో మెగా ర్యాలీ దీపేందర్ సంపదను రూ.1,638 కోట్లు పెంచి రూ.10,288 కోట్లుగా మార్చేసింది.


Click it and Unblock the Notifications