IT News: ఐటీ రంగాన్ని కమ్మేస్తున్న మాంద్యం.. సంచలనంగా మారిన ఆయన ట్వీట్.. భయంలో టెక్కీలు
IT News: ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఐటీ సేవలను అందిస్తూ భారత్ ఈ రంగంలో అగ్రగామిగా ముందుకు సాగుతోంది. నైపుణ్యం కలిగిన యువత, తక్కువ ఖర్చుకు సేవలు అందుబాటులో ఉండటంతో గ్లోబల్ స్థాయిలో టెక్ రంగం మెరుస్తోంది.
అయితే ఈ ఐటీ కోటకు బీటలు వారుతున్నాయి. గత ఏడాది చివర్లో మెుదలైన అలజడులు 2023 ప్రారంభం నుంచి భారత ఐటీ, టెక్ సేవల రంగం భారీగా సవాళ్లను ఎదుర్కొంటోంది. రానున్న త్రైమాసికాల్లో అంచనాలు సైతం షాకింగ్ గానే కొనసాగుతున్నాయి. ఇప్పటికే యాక్సెంచర్ అందించిన వివరాలు కంపెనీల్లో ఆందోళనలను రేకెత్తిస్తుండగా.. ఆ పరిశ్రమలోని ప్రముఖులు గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయని బాహాటంగానే చెబుతున్నారు.

దేశంలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ ZOHO చైర్మన్, వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు పరిశ్రమ పరిస్థితులపై సంచలన ట్వీట్ పోస్ట్ చేశారు. ఇప్పటికే జీతాల పెంపులు లేక, వేరియబుల్ పే చెల్లింపుల్లో కోతలు ఎదుర్కొంటున్న టెక్కీలను ఇది నిజంగా నిద్ర పోనివ్వటం లేదు. గడచిన సెప్టెంబర్ మాసంలో ప్రపంచ వ్యాప్తంగా అనని దేశాల్లో, అన్ని ప్రాజెక్టుల్లో వృద్ధి నెమ్మదించిందని తాము గమనించినట్లు వెంబు తెలిపారు. ఇది ఆదాయ స్థాయిలపై కూడా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
తన అంచనాల ప్రకారం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ గడ్డు స్థితికి చేరుకుందని పేర్కొన్నారు. ఇది అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన తరుణంగా తాను భావిస్తున్నట్లు తెలిపారు. గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ గత కొన్ని నెలలుగా కుంటుపడుతోన్న సంగతి అనేక నివేదికలు చెబుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ షట్‌డౌన్ అంచుల వరకు వెళ్లి చివరి నిమిషాల్లో ఊరట పొందిన సంగతి తెలిసిందే. దీనికి తోడు చాలా యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు అధిక ద్రవ్యోల్బణం కారణంగా మాంద్యంలోకి జారుకున్నాయి. చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి, వినియోగం రేటు కూడా భారీగా క్షీణించటంతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల రుణ స్థాయి పెరగటం ఆందోళనలు కలిగిస్తోంది.


Click it and Unblock the Notifications