Zerodha News: భారత్‌ను ఫాలో అవుతున్న అమెరికా.. జెరోధా CEO కీలక కామెంట్స్
Settlement Cycle: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నిబంధనల్లో గత కొన్నేళ్లుగా పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సెటిల్‌మెంట్ విషయంలో సెబీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అగ్రరాజ్యం అమెరికాను సైతం వెనక్కునెట్టి త్వరిత సెటిల్‌మెంట్ విధానాన్ని భారత్ అమలు చేసి చూపించింది. ఆర్థిక వృద్ధి పథంలోనే కాదు మార్కెట్ల పరంగానూ ఇతర దేశాలకు విశ్వగురువుగా భారత్ దిశానిర్దేశం చేస్తోంది.
రెండేళ్ల క్రితం నుంచి భారతీయ ఫైనాన్షియల్ మార్కెట్లు అవలంభిస్తున్న T+1 సెటిల్‌మెంట్ సైకిల్‌పై అమెరికా కీలక ప్రకటన చేసింది. తాము కూడా ఇకపై ఇదే విధానంలో ముందుకు సాగనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు భారతీయ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ముందుచూపుతో కూడిన నిబంధనలకు గాను పలువురు కృతజ్ఞతలు చెబుతున్నారు. కాగా మరి తరువాత ఏమిటనే దానిపై ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో చర్చ మొదలైంది.

ఇదే విషయంపై జెరోధా సహ వ్యవస్థాపకులు నితిన్ కామత్ Xలో స్పందించారు. 'T+1కి మారడం మంచిదే. అయితే తక్షణ సెటిల్‌మెంట్‌కి వెళ్లడంలో పలు విషయాలు గమ్మత్తుగా ఉంటాయి. ఎందుకంటే సుమారు 75 శాతం ఇంట్రాడే ట్రేడ్‌లు స్పెక్యులేటివ్స్. సాధారణంగా వారి వద్ద నగదు ఉండదు లేదా తక్షణ పరిష్కారం కోసం చేతిలో స్టాక్ కూడా ఉండవు' అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అందువల్ల ఈ మార్పు అంత సులభం కాదనే భావన వ్యక్తం చేశారు.
తక్షణ సెటిల్‌మెంట్ సవాళ్లతో కూడినదని నితిన్ అభిప్రాయపడ్డారు. డెలివరీ ఆధారిత ట్రేడ్స్ కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని క్రియేట్ చేయడం ఒక పరిష్కారం కావచ్చన్నారు. 'డెలివరీ విభాగంలో తక్కువ లిక్విడిటీ కారణంగా వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మార్కెట్ ఈ వీటన్నిటినీ జాగ్రత్తగా సమతుల్యం చేసుకోవాల్సి ఉంటుంది' అని కామత్ పేర్కొన్నారు.
క్రిప్టోకరెన్సీ విభాగంతో పోల్చి చూస్తే ఇక్కడ కొన్ని కీలకమైన తేడాలను గమనించవచ్చని నితిన్ చెప్పుకొచ్చారు. 'క్రిప్టో ఎక్స్ఛేంజీలలో షార్ట్-సెల్ చేయడానికి రుణం తీసుకోవాలి. కానీ అది పూర్తయిన తర్వాత నిరవధికంగా ఆ పొజిషన్ కలిగి ఉండవచ్చు. కానీ భారతీయ మార్కెట్లలో షార్ట్ సెల్లింగ్ ఈక్విటీలు అనేవి కచ్చితంగా ఇంట్రాడే కార్యకలాపాలు. కాబట్టి రెండింటికీ పొంతన కుదరకపోవచ్చు' అని వివరించారు. దీని సమర్థ నిర్వహణకు కాలమే సమాధానం చెబుతుందన్నారు.


Click it and Unblock the Notifications