Zerodha app crash: స్టాక్ బ్రోకింగ్ కంపెనీల్లో జెరోధాకు మంచి పేరుంది. సంస్థ CEO నితిన్ కామత్ కూడా తరచుగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉంటారు. పలు సామాజిక, ఆర్థిక విషయాలను ప్రస్తావిస్తూ యాక్టివ్‌గా కనిపిస్తారు. అయితే ప్రతిసారీ ఒక విషయంపై ఆయనను నెటిజన్లు ఆడుకుంటూ ఉంటారు. ట్రేడింగ్ యాప్ లో తలెత్తుతున్న సమస్యలపై నిలదీస్తుండటం జరుగుతూనే ఉంటుంది.
తాజాగా మరోసారి జెరోధా ట్రేడింగ్ యాప్ క్రాష్ అయ్యింది. దేశంలోని రెండవ అతిపెద్ద స్టాక్ బ్రోకర్ సంస్థ యాప్ లో సాంకేతిక లోపం తలెత్తినట్లు సోషల్ మీడియాలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆర్డర్లు ప్లేస్ చేస్తున్న సమయంలో స్క్రీన్ స్తంభించిపోయినట్లు యూజర్లు పోస్టులు పెట్టారు. కైట్ యాప్‌లో సమస్య వల్ల ఓపెన్ పొజిషన్స్ స్క్వేర్ ఆఫ్ చేయలేకపోయామని ఇన్వెస్టర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో భారీగా నష్టపోయామని ఆవేదన చెందుతూ సంస్థపై విరుచుకుపడ్డారు.

ఇన్వెస్టర్లు లేవనెత్తిన ఫిర్యాదులపై జెరోధా స్పందించింది. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు చెప్పింది. సమస్యను త్వరగా పరిష్కరించామని, యాప్ చెక్ చేసుకోవాలని వినియోగదారులకు సూచించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో పోస్ట్ చేసింది. అయితే తరచుగా ఇలా జరుగుతూ ఉండటంపై కస్టమర్లు మాత్రం మండిపడుతున్నారు.
యాక్టివ్ కస్టమర్ల పరంగా గ్రో అతి పెద్ద డిస్కౌంట్ బ్రోకర్ కాగా.. 17.5 శాతం వాటాతో జెరోధా తదనంతర స్థానంలో కొనసాగుతోంది. 2023లో కైట్ యాప్ మొత్తం 8 సార్లు క్రాష్ అయినట్లు కంపెనీనే ఒప్పుకుంది. అందులో లాగిన్, ఆర్డర్ ప్లేస్మెంట్, పొజిషన్ స్పేర్ ఆఫ్, స్క్రీన్ హ్యాంగ్ వంటి సమస్యలు తలెత్తినట్లు అంగీకరించింది. కాగా ఈ ఏడాది కూడా పద్ధతి మార్చుకోకుండా అవే తప్పులు రిపీట్ చేస్తుండటాన్ని ఇన్వెస్టర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.


Click it and Unblock the Notifications