Zara Store Closed: ప్రస్తుతం భారతదేశంలో అధిక రెంట్స్ సామాన్య ప్రజల నుంచి కార్పొరేట్ కంపెనీల వరకు అందరినీ బాధిస్తోంది. ప్రధానంగా ముంబై వంటి మెట్రో నగరాల్లో అద్దెలకు పెద్దపెద్ద ఫ్యాషన్ బ్రాండ్స్ కూడా హడలిపోతున్నాయి.
వివరాల్లోకి వెళితే ఫ్యాషన్ బ్రాండ్ జారా దాదాపు 8 సంవత్సరాలుగా దక్షిణ ముంబైలోని ఫోర్ట్ ప్రాంతంలోని హుతత్మా చౌక్‌లో ఉన్న తన ఐకానిక్ 5 అంతస్తుల ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను మూసివేసింది. ఈ బ్రాండ్ ఇప్పటికే మార్కెట్లో హెచ్ అండ్ ఎమ్, స్నిచ్, జుడియో వంటి అనేక ఇతర పేరొందిన బ్రాండెడ్ కంపెనీలతో వ్యాపారంలో పోటీ పడుతోంది. తాజాగా కంపెనీ తన ముంబై స్టోర్ వద్ద దానిని క్లోజ్ చేసినట్లు ఒక నోటీసును అందించటంతో పెద్ద చర్చ మెుదలైంది. కంపెనీ తన నిర్ణయానికి వెనుక ఉన్న కారణాల గురించి సదరు నోటీసులో ప్రస్థావించలేదు.

కానీ జారా ఫిబ్రవరి 23న వ్యాపార సమయం ముగిసిన తర్వాత ఈ స్టోర్ కార్యకలాపాలను నిలిపివేస్తుందని దయచేసి కస్టమర్లు గమనించాలని అక్కడ అతికించిన నోటీసులో ఉంది. స్పానిష్ ఫ్యాషన్ బ్రాండ్ ఈ అవుట్‌లెట్ కోసం నెలకు రూ.2.25 కోట్ల అద్దెను రూ.13.5 కోట్ల డిపాజిట్‌తో చెల్లించింది. అంటే ఈ భవనానికి రోజువారీ కేవలం అద్దె రూపంలోనే రూ.7.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక పోతే ఉద్యోగుల నుంచి ఇతర మెయింటెనెన్స్ ఖర్చులు దీనికి అదనం. ఇంత భారీ అద్దె చెల్లించటం ప్రస్తుత వ్యాపార కార్యకలాపాలకు సరైనది కాదని కంపెనీ భావించటం వల్లనే ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. స్టోర్ అమ్మకాలు అధిక అద్దెలకు సరితూగలేదని విషయం తెలిసిన వ్యక్తులు బయటకు చెప్పారు.
స్పానిష్ ఫ్యాషన్ బ్రాండ్ జారా మాతృ సంస్థ ఇండిటెక్స్ SA, టాటా గ్రూప్ ట్రెంట్‌తో జాయింట్ వెంచర్‌లోకి ప్రవేశించిన తర్వాత భారత మార్కెట్లో విక్రయాలు చేయటానికి ఎంట్రీ ఇచ్చింది. ఇండిటెక్స్ ట్రెంట్ 2017లో 100 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఇస్మాయిల్ భవన దుకాణాన్ని లీజుకు తీసుకొని, 5 ఏళ్ల లాక్-ఇన్ వ్యవధితో సంవత్సరానికి రూ.30 కోట్ల అద్దె ఒప్పందం కుదుర్చుకుంది. 2017లో ప్రారంభించబడిన హుతాత్మ చౌక్ స్క్వేర్ అవుట్‌లెట్ వాస్తవానికి దేశంలోనే అతిపెద్ద జారా అవుట్‌లెట్, ముంబైలో దాని ఏకైక ఆఫ్ లైన్ స్టోర్. కానీ భారీ అద్దెల కారణంగా ప్రస్తుతం ఇది మూతపడటం ఫ్యాషన్ ప్రపంచంలో కంపెనీల నిర్ణయాలు, ఖర్చులు, బ్రాండ్ పొజిషనింగ్, ఇతర వ్యాపార సంస్థలతో ఉన్న పోటీ వంటి అనేక అంశాలపై స్పష్టతను ఇస్తోంది.
ఈ క్రమంలోనే లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ ఇప్పుడు అదే ఐకానిక్ భవనంలోని రిటైల్ స్థలాన్ని 5 సంవత్సరాల లీజుకు రూ.36 కోట్ల వార్షిక అద్దెకు లీజుకు తీసుకున్నట్లు నివేదించబడింది. ప్రాప్‌స్టాక్ పొందిన రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం ఈ విషయం ధృవీకరించబడింది. పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ 2018లో కొనుగోలు చేసిన పెర్నియా పాప్-అప్ షాప్ బ్రాండ్ కింద హై-ఎండ్ డిజైనర్ బ్రాండ్‌లను రిటైల్ చేస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications