ఏపీలో జగన్ మావిగున్ ప్రకంపనలు.. రాజధాని అమరావతికి రూ. 2 లక్షల కోట్లుపై హాట్ హాట్ డిబేట్..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరోసారి రాజకీయ సెగలు రేపుతోంది. అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026ను ఆమోదించిన నేపథ్యంలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక వినూత్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దీనిని ఆయన రాజధాని ప్రాంతాభివృద్ధికి సంబంధించి "ప్లాన్ బి"గా అభివర్ణించారు.
జగన్ ప్రతిపాదించిన ఈ కొత్త నమూనాలో ప్రధానాంశం మావిగున్' (MAVIGUN) అని చెప్పవచ్చు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ సుమారు 110 కిలోమీటర్ల పొడవైన పట్టణ కారిడార్‌ను సమీకృత రాజధాని ప్రాంతంగా ప్రకటించాలని ఆయన కోరారు. మచిలీపట్నం నుండి విజయవాడకు 70 కిలోమీటర్లు, విజయవాడ నుండి గుంటూరుకు 40 కిలోమీటర్ల దూరం ఉందని, ఈ మూడు ప్రాంతాలను కలిపితే సహజసిద్ధమైన ఆర్థిక సమూహం (Economic Cluster) ఏర్పడుతుందని ఆయన వివరించారు.

ఈ ప్రాంతంలో ఇప్పటికే సుమారు 40 లక్షల జనాభా ఉందని, మౌలిక సదుపాయాలపై ఇక్కడ పెట్టే పెట్టుబడి తక్కువ కాలంలోనే గరిష్ట ఫలితాలను ఇస్తుందని జగన్ వాదించారు. అభివృద్ధిని కేవలం అమరావతి అనే పరిమిత ప్రాంతానికే పరిమితం చేయకుండా, ఈ కారిడార్ అంతటా వికేంద్రీకరించాలని ఆయన సూచించారు.
మరోవైపు, లోక్‌సభలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు వాకౌట్ చేశారు. పి. మిథున్ రెడ్డి నేతృత్వంలోని ఎంపీల బృందం ఈ బిల్లును కేవలం రాజకీయ ప్రేరేపితమైనదిగా విమర్శించింది. అమరావతి ప్రాజెక్టు ఆర్థిక సాధ్యాసాధ్యాలపై జగన్, ఆయన పార్టీ నేతలు తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. అమరావతిలో కేవలం ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనకే దాదాపు రూ. 2 లక్షల కోట్లు అవసరమవుతాయని.. ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఇంత భారీ నిధులను ఎక్కడి నుండి సమీకరిస్తుందని వారు ప్రశ్నించారు. గత కొన్నేళ్లుగా అక్కడ కేవలం రూ. 5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, లక్ష ఎకరాలకు రాజధానిని విస్తరించడం వల్ల నిర్మాణ వ్యయం విపరీతంగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదని జగన్ ఆరోపించారు. 50 వేల ఎకరాల భూమిని సేకరించినప్పటికీ, రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస సౌకర్యాలు కూడా అసంపూర్తిగానే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. తమ పార్టీ అమరావతికి గానీ, మరే ప్రాంతానికి గానీ వ్యతిరేకం కాదని, కేవలం "రాజధాని పేరుతో జరిగే అవినీతికి" మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాజ్యాంగంలో ఎక్కడా 'రాజధాని' అనే పదం లేదని, కేవలం 'పరిపాలనా పీఠాలు' మాత్రమే ఉంటాయని పేర్కొంటూ..రాజధాని నిర్ణయాధికారం పూర్తిగా రాష్ట్రాలదేనని కేంద్రం కోర్టులకు తెలిపిన విషయాన్ని ఆయన ఉటంకించారు.
ఏదేమైనా జగన్ చేసిన 'మావిగున్' ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ రాజధాని చర్చను కొత్త మలుపు తిప్పింది. అమరావతి అభివృద్ధి వ్యయాన్ని తగ్గించి, ఇప్పటికే ఉన్న నగరాల మౌలిక సదుపాయాలను వాడుకుంటూ సమతుల్య వృద్ధి సాధించడమే ఈ "ప్లాన్ బి" ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది. ప్రభుత్వం కేవలం ఒకే ప్రాంతంపై కాకుండా, ఈ సమీకృత కారిడార్‌పై దృష్టి సారిస్తే దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయని వైఎస్సార్‌సీపీ గట్టిగా వాదిస్తోంది.


Click it and Unblock the Notifications