జగన్ గుడ్‌న్యూస్: రెండింతలు పెరిగి రూ.30వేలకు అంబులెన్స్ ఉద్యోగుల వేతనాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 108, 108 ఉద్యోగులకు శుభవార్త. ఈ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎం జగన్‌ను కలిశారు. వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేస్తే, సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. తమ వేతనాల పెంపుపై భరోసా ఇచ్చారని చెప్పారు. ఈ వేతనాలు కూడా ఎక్కువ మొత్తంలో పెంచనున్నారు.

రెండింతల కంటే ఎక్కువ
108 వాహనాల్లో రెండు వేల మందికి పైగా పని చేస్తున్నారు. ఇందులో డ్రైవర్‌కు ఇప్పటి వరకు రూ.13 వేల వేతనం ఉంది. దీనిని రూ.28 వేలకు పెంచనున్నారు. అలాగే, ఈఎంటీ(ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్)కు ప్రస్తుతం రూ.15 వేల వేతనం ఉంది. దీనిని రెండింతలు చేసి రూ.30 వేలు ఇవ్వనున్నారు. ఈ పెంపుకు ముఖ్యమంత్రి జగన్ అంగీకరించినట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెప్పారు.

104 వాహనాలకు దాదాపు రెండింతలు
ఇక, 104 వాహనాల్లో దాదాపు 1,500 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్స్‍కు రూ.17,500 చొప్పున వేతనం ఉంది. దానిని రూ.28,000కు పెంచనున్నారు. 104 వాహనాల్లోని డ్రైవర్‌కు ప్రస్తుతం రూ.15,000 వేతనం ఉండగా దానిని రూ.26,000కు పెంచేందుకు అంగీకరించారు.

ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ పరిధిలోకి...
అలాగే, తాము సర్వీస్ ప్రొవైడర్ కింద పని చేయలేమని ఉద్యోగులు విన్నవించారు. అందరినీ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ పరిధిలో పని చేసే విధంగా చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి తమ కష్టాన్ని గుర్తించి వేతనాలు పెంచేందుకు అంగీకరించారని ఉద్యోగ సంఘాల నేతలు ఆనందం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications