Youtube warning: కంటెంట్ క్రియేటర్స్‌కు యూట్యూబ్ కొత్తరూల్.. అలా చేయకపోతే సస్పెండ్ చేస్తామని వార్నింగ్!
Youtube warning: యూట్యూబ్, X వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కంటెంట్ జనరేటర్స్ మంచి ఆదాయం సంపాదిస్తున్నారు. వీక్షణలు పెరిగేకొద్దీ సంపాదన పెరుగుతుండటంతో.. పలువురు దీనిపై దృష్టి సారిస్తున్నారు. అయితే కంటెంట్ విషయంలో మాత్రం గూగుల్ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. వాటిని మీరితే ఏమాత్రం సహించదు. తాజాగా యూట్యూబ్ ఓ కొత్త రూల్ తీసుకొచ్చింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భారీ స్థాయిలో ఫేక్ కంటెంట్ పెరిగిపోతోంది. దీన్ని కట్టడి చేసేందుకు యూట్యూబ్ నడుం బిగించింది. ఎవరైనా తమ వీడియోలలో జనరేటివ్ AIని వినియోగించి వాస్తవికంగా కనిపించేలా చేస్తే, దాన్ని ముందే తెలియజేయాలని స్పష్టం చేసింది. లేని పక్షంలో జరిమానా విధిస్తామని కంటెంట్ క్రియేటర్స్ ను హెచ్చరించింది.

భారతీయ నటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తీవ్రంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై బిగ్ బీ అమితాబ్ సహా పలువురు రియాక్ట్ అయ్యారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా యూట్యూబ్ చర్యలకు దిగింది. ఇలాంటి వీడియోలను తమ ప్లాట్ ఫారమ్ లో డౌన్ చేయడంతో పాటు రెవెన్యూ షేరింగ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెండ్ చేస్తామని బ్లాగ్ పోస్ట్‌లో స్పష్టం చేసింది.
'జనరేటివ్ AIకి యూట్యూబ్ లో సృజనాత్మకతను అన్‌లాక్ చేయగల సామర్థ్యం ఉంది. మా ప్లాట్‌ఫారమ్‌లో వీక్షకులు మరియు కంటెంట్ సృష్టికర్తల అనుభవాన్ని మార్చగల సత్తా దాని సొంతం' అని యూట్యూబ్ ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్‌లు జెన్నిఫర్ ఫ్లానరీ ఓ'కానర్ మరియు ఎమిలీ మోక్స్లీలు పేర్కొన్నారు. వీటి నుంచి యూట్యూబ్ కమ్యూనిటీని రక్షించే బాధ్యత తమపై ఉన్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications