Youtube down: యూట్యూబ్ ఆగిపోయింది! వీడియోలు ప్లే అవ్వడం లేదు.. అప్‌లోడింగ్ బంద్! ఏం జరిగింది?
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వాడే వీడియో ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ బుధవారం సాయంత్రం ఒక్కసారిగా స్తంభించిపోయింది. భారత్ సహా పలు దేశాల్లో వేలాది మంది యూజర్లు యూట్యూబ్ సేవలకు అంతరాయం కలిగిందంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. వీడియోలు ప్లే కాకపోవడం, హోమ్ పేజీ బ్లాంక్ (Blank) గా రావడం, , యాప్ క్రాష్ అవ్వడం వంటి సమస్యలతో యూజర్లు ఇబ్బంది పడుతున్నారు.

డోన్‌డెటెక్టర్ (Downdetector) రిపోర్ట్ ఏం చెబుతోంది?
అవుటేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ డోన్‌డెటెక్టర్ ప్రకారం, దాదాపు 39 శాతం మంది యూజర్లు వీడియో స్ట్రీమింగ్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీడియోలు లోడ్ అవ్వకపోవడం లేదా ప్లే అవుతున్నప్పుడు మధ్యలోనే బఫరింగ్ (Buffering) అవ్వడం వంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. సుమారు 24 శాతం మంది యూజర్లు అసలు యూట్యూబ్ యాప్ ఓపెన్ అవ్వడం లేదని, ఓపెన్ అయినా ఫ్రీజ్ అయిపోతోందని చెబుతున్నారు. మరో 20 శాతం మందికి సర్వర్ కనెక్షన్ ఎర్రర్స్ వస్తున్నాయి.
క్రియేటర్లకు తప్పని తిప్పలు
ఈ అంతరాయం కేవలం వీక్షకులకే కాదు, వీడియోలు చేసే క్రియేటర్లకు కూడా పెద్ద తలనొప్పిగా మారింది. యూట్యూబ్ డౌన్ (YouTube down) అవ్వడంతో యూట్యూబ్ స్టూడియో (YouTube Studio) సరిగ్గా పనిచేయడం లేదు. వీడియోలు అప్‌లోడ్ చేసేటప్పుడు "Something went wrong" లేదా "Server error" వంటి మెసేజ్‌లు కనిపిస్తున్నాయని పలువురు క్రియేటర్లు సోషల్ మీడియా వేదికగా వాపోతున్నారు. అనలిటిక్స్ , అప్‌లోడింగ్ టూల్స్ యాక్సెస్ చేయడంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
సోషల్ మీడియాలో మీమ్స్ రచ్చ
యూట్యూబ్ పనిచేయకపోవడంతో యూజర్లు ఎక్స్ (X) వంటి ఇతర ప్లాట్‌ఫారమ్స్‌లోకి వెళ్లి పరిస్థితిని ఆరా తీస్తున్నారు. "యూట్యూబ్ ఒక్కటే ఆగిందా లేక నా ఇంటర్నెట్ సమస్యనా?" అంటూ నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. హ్యాష్ ట్యాగ్ #YouTubeDown ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. దీనిపై యూట్యూబ్ యాజమాన్యం నుండి ఇంకా అధికారిక వివరణ రాలేదు. సాధారణంగా ఇటువంటి సాంకేతిక లోపాలు బ్యాక్-ఎండ్ సర్వర్ స్టెబిలైజేషన్ ద్వారా అతి త్వరలోనే పరిష్కారమవుతుంటాయి.
ఇలా చేసి చూడండి
ఒకవేళ మీకు కూడా యూట్యూబ్ డౌన్ (YouTube down) అనిపిస్తే లేదా వీడియోలు రాకపోతే.. ఈ చిన్న టిప్స్ పాటించి చూడండి..
- మీ ఇంటర్నెట్ కనెక్టివిటీని ఒకసారి చెక్ చేయండి.
- యూట్యూబ్ యాప్‌ను క్లోజ్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేయండి.
- ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యూట్యూబ్ యాప్ 'Cache' క్లియర్ చేయండి.
- యాప్ అప్‌డేట్ వెర్షన్ వాడుతున్నారో లేదో చూసుకోండి.
గతంలో ఫిబ్రవరి 2026లో కూడా యూట్యూబ్ భారీ గ్లోబల్ అవుటేజ్‌ను ఎదుర్కొంది. అప్పుడు దాదాపు 3 లక్షల మందికి పైగా ఫిర్యాదులు చేశారు. ప్రస్తుత సమస్య కూడా తాత్కాలికమేనని, కొద్దిసేపట్లో సేవలు యధావిధిగా పునరుద్ధరించబడతాయని నిపుణులు భావిస్తున్నారు. యూట్యూబ్ సపోర్ట్ ఛానెల్స్ నుండి వచ్చే అప్‌డేట్స్ కోసం యూజర్లు వేచి చూస్తున్నారు.


Click it and Unblock the Notifications