Youtube: కంటెంట్ క్రియేటర్స్‌కు షాక్.. ఆ వీడియోలు డిలీట్ చేస్తున్న యూట్యూబ్
ఈ మధ్య యూట్యూబ్ లో వీడియోలు చేయడం ద్వారా సంపాదించే వారి సంఖ్య ఎక్కువవుతోంది. కొత్త కంటెంట్ ను వీక్షకులకు అందించడంతో ప్రజలు సైతం ఆదరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2.6 బిలియన్ యూజర్లు యూట్యూబ్ కు ఉన్నారు. 2023లో 29.24 బిలియన్ డాలర్లు ఆర్జించింది. గూగుల్ మొత్తం రెవెన్యూలో 11.35 శాతం యూట్యూబ్ నుంచే వస్తుండటం విశేషం.
ఏ చిన్న సమాచారం కావాలన్నా ఈమధ్య వీడియో రూపంలో తెలుసుకునేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే కొత్త కంటెంట్ కు ఆదరణ పెరిగింది. గత మూడేళ్లలో వారికి యూట్యూబ్ 30 బిలియన్ డాలర్లు చెల్లించింది. వైద్య, ఆరోగ్య విభాగంలో కూడా సాధ్యమైనన్ని వీడియోలు చేస్తూ ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుతున్నారు. కరోనా అనంతరం ఈ తరహా వీడియోలకు డిమాండ్ మరింత పెరిగింది అనడంలో ఆశ్చర్యం లేదు.

ఓ వైపు ఇవి పలువురికి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, కొన్ని వీడియోలు స్థానిక వైద్య విభాగంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నాయి. తాజాగా వీటిపై యూట్యూబ్ కన్నెర్ర జేసింది. మార్గదర్శకాలకు అనుగుణంగా లేని ఈ తరహా వీడియోలను తొలగిస్తోంది. ఇకపై వీటిని పోస్ట్ చేసే నిబంధనలు సైతం కఠినతరం చేస్తోంది.
వెల్లుల్లి క్యాన్సర్ ను నయం చేస్తుంది, రేడియేషన్ థెరపీకి బదులు విటమిన్ C తీసుకోండి తరహా వీడియోలను రిమూవ్ చేస్తున్నట్లు యూట్యూబ్ తన బ్లాగ్ పోస్ట్ లో పేర్కొంది. కంటెంట్ క్రియేటర్స్ నుంచి తప్పుడు సమాచారం నిరోధించడానికి, మార్గదర్శకాలు పాటించే విధంగా చేయడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.


Click it and Unblock the Notifications