Yes Bank: యెస్ బ్యాంక్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. ఆర్‌బీఐ నిర్ణయంతో దూసుకుపోతున్న షేర్..
Yes Bank: ఒకప్పుడు సూపర్ లాభాలు అందించిన యెస్ బ్యాంక్ పాతాళానికి పడిపోయిన రోజులు ఇన్వెస్టర్ల కళ్ల ముందు ఇప్పటికీ మెదులుతూనే ఉంటుంది. యాజమాన్యం చేసిన తప్పులతో పెట్టుబడిదారులు విలువ కోల్పోవటం, ఆ తర్వాత ఆర్బీఐ రంగంలోకి దిగటంతో షేర్ కళ తప్పింది. ఒకానొక సందర్భంలో షేర్ ధర రూ.5 స్థాయికి చేరుకుంది.

RBI తాజా నిర్ణయం..
యెస్ బ్యాంక్‌లో 9.99% వరకు కొనుగోలు చేయడానికి అమెరికాకు చెందిన కార్లైల్ గ్రూప్, అడ్వెంట్ ఇంటర్నేషనల్‌లకు షరతులతో కూడిన అనుమతిని సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ఇచ్చింది. ఈ వార్త వెలువడిన నేపథ్యంలో స్టాక్ ఈరోజు ట్రేడింగ్ సెషన్లో 3 శాతం పెరిగి రూ.17.90 స్థాయిని తాకింది. చివరగా మార్కెట్ ముగిసే సమయానికి 2.64 శాతం లాభపడిన స్టాక్ రూ.17.50 వద్ద ఎన్ఎస్ఈలో ముగిసింది. ఈ క్రమంలో యెస్ బ్యాంక్ 52 వారాల గరిష్ఠ ధర అయిన రూ.18.20కి దగ్గరగా ట్రేడ్ అవుతోంది.

అసలు ఏం జరుగుతోందంటే..
ప్రైవేట్ రంగానికి చెందిన యెస్ బ్యాంక్ లో ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు కార్లైల్ గ్రూప్, అడ్వెంట్ వాటాను కొనుగోలు చేయడానికి రిజర్వు బ్యాంక్ నుంచి అనుమతి పొందాయి. ఈక్విటీ షేర్లు, షేర్ వారెంట్లను కొనుగోలు చేయడం ద్వారా ఈ రెండు సంస్థలు బ్యాంక్ పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్‌లో 9.99 శాతం వరకు యాజమాన్యాన్ని తీసుకోవచ్చని వెల్లడించింది.

యెస్ బ్యాంక్ ఏమందంటే..
పెట్టుబడి పెడుతున్న రెండు ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు నిబంధనలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నాయని యెస్ బ్యాంక్ వెల్లడించింది. దీనికి సంబంధించిన తుది ఆమోదం పొందేందుకు ఈ రెండు ఇప్పటికే ఆర్బీఐని ఆశ్రయించాయి. RBI చొరవతో సమస్యాత్మకమైన యెస్ బ్యాంక్‌ను రక్షించడానికి 2020లో కార్లైల్ గ్రూప్, అడ్వెంట్ ముందుకొచ్చాయి. ఈ సంస్థలు యెస్ బ్యాంక్ లో పెట్టుబడులు పెట్టడం ఇటీవలి సంవత్సరాల్లో అతిపెద్ద బ్యాంకింగ్ పెట్టుబడుల్లో ఒకటిగా నిలుస్తోంది.

మెుండి బకాయిలతో..
భారీగా మొండి బకాయిల(NPA) సమస్యతో యెస్ బ్యాంక్ కొట్టుమిట్టాడుతోంది. ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజానికి దాదాపుగా రూ.50,000 కోట్లు విలువైన మెుండి బకాయిలు సర్థుబాటు చేసిన తర్వాత ప్రస్తుతం కొంత మేర మెరుగుపడింది. దీని కోసం బ్యాంక్ JC ఫ్లవర్స్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. ప్రస్తుత డీల్ బ్యాంక్ వృద్ధికి దోహదపడుతుందని నిపుణులు అంటున్నారు.


Click it and Unblock the Notifications