యస్ బ్యాంకు ఏడాదిలో 93% శాతం డౌన్, మేమేం చేస్తామో చూస్తారుగా.. RBI గవర్నర్ హామీ
ముంబై: కరోనా వైరస్, యస్ బ్యాంకు అంశాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం స్పందించారు. కరోనా భయాలతో స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోయాయి. కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని సవాళ్లకు సిద్ధమని ఆయన హామీ ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు ఆర్బీఐ అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అవసరమైన విదేశీ మారకపు నిల్వ ఉందన్నారు.

చైనాపై ఆధారపడిన రంగాలపై తీవ్ర ప్రభావం
అంతర్జాతీయంగా నెలకొన్న నగదు కొరత సమస్యను తీర్చేందుకు కరెన్సీ మార్పిడి మరింత సరళతరం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని IMFకు సూచించారు. ఆర్థిక వ్యవస్థపై వైరస్ ముప్పును ఎదుర్కొనేందుకు అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు కలిసి పని చేయాలని తీర్మానించినట్లు చెప్పారు. దేశీయంగా చైనాపై ఆధారపడిన రంగాలపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. దీనిని అరికట్టేందుకు చర్యలు ఉంటాయన్నారు.

30 రోజుల గడువు..
యస్ బ్యాంకు అంశంపై ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ... ఈ బ్యాంకుకు మళ్లీ జీవం పోసేందుకు 30 రోజుల గడువు ఇచ్చామన్నారు. అంతకన్నా ముందే ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. బ్యాంకుల సమస్యను పరిష్కరించాలంటే ఆ బ్యాంకులకు కొంత సమయమివ్వాలన్నారు.

ఆ తర్వాతే జోక్యం..
యస్ బ్యాంకు సరిగా పనిచేయడం లేదని తెలిసిన తర్వాతనే ఆర్బీఐ జోక్యం చేసుకుందన్నారు. భయాలు అవసరం లేదని, యస్ బ్యాంకు విషయంలో సరైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పునరుద్ధరించేందుకు ఏం చర్యలు తీసుకుంటామో మీరు చూస్తారన్నారు.

భారీగా పడిపోయిన షేర్ ధర
ఇదిలా ఉండగా, మారటోరియం వార్తలు రావడంతో శుక్రవారం యస్ బ్యాంకు షేర్లు 85% పడిపోయాయి. ఆర్బీఐ గవర్నర్ హామీ తర్వాత షేర్ కనిష్ట స్థాయి నుండి 180 శాతం ఎగిసింది. ఓ సమయంలో రూ.6కు పడిపోయిన షేర్ ఆ తర్వాత రూ.16.60 వద్ద క్లోజ్ అయింది. ఓ సమయంలో 85 శాతం పడిపోయిన షేర్ ఆ తర్వాత 55 శాతం వద్ద ముగిసింది.

ఏడాదిలో 93 శాతం పడిపోయిన షేర్
యస్ బ్యాంకు షేర్ గత ఏడాది కాలంలో ఏకంగా 93 శాతం పడిపోయింది. ఈ క్యాలెండర్ (2020)లోనే 68 శాతం మేర పడిపోయింది. గురువారం నాటి సెషన్లో యస్ బ్యాంకు షేర్ 36.85 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు రూ.16కు పడిపోయింది.


Click it and Unblock the Notifications