తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న యస్ బ్యాంకు కస్టమర్లు, ఇన్వెస్టర్లకు శుభవార్త. మార్చి 5వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మారటోరియం విధించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇది ఉంటుందని తెలిపింది. అయితే దీనిని మరో మూడు రోజుల్లో ఎత్తివేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఇది కస్టమర్లు, ఇన్వెస్టర్లకు తీపి కబురు.

18న మారటోరియం ఎత్తివేత
యస్ బ్యాంకుపై మార్చి 5వ తేదీన ఆర్బీఐ విధించిన మారటోరియాన్ని 18వ తేదీన ఎత్తివేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం ఆర్బీఐ ప్రతిపాదించిన యస్ బ్యాంకు పునరుద్ధరణ ప్రణాళిక 2020 అమలులోకి వచ్చినట్లు అయింది.

అలా బుధవారం ఎత్తివేత
ఈ నెల 5న ఆర్బీఐ మారటోరియం విధించి నేపథ్యంలో ఏప్రిల్ 3వ తేదీ వరకు ఒక్కో డిపాజిటర్ రూ.50వేలకు మించి నగదును ఉపసంహరించుకోవడానికి వీలు లేదు. అంతేగాక ప్రస్తుత బోర్డును రద్దు చేసిన ఆర్బీఐ వేరేవారికి పగ్గాలు అప్పగించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి నుంచి పునర్‌వ్యవస్థీకరణ పథకం అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా 18 పని గంటల్లో మారటోరియం తొలగిపోనుంది. శని, ఆదివారాలు బ్యాంకులకు సెలవులు. కాబట్టి బుధవారం వరకు మారటోరియం ఎత్తివేయనున్నారు.

అయిదో అతిపెద్ద బ్యాంకు..
కొత్త సీఈవో, ఎండీ ప్రశాంత్ కుమార్ నేతృత్వంలో కొత్త బోర్డు మార్చి నెలాఖరు వరకు ఏర్పాటు కానుంది. ఈ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సునీల్ మెహెతా (PNB మాజీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్), నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా మహేశ్ కృష్ణమూర్తి, అథుల్ భేడ ఉంటారు. దేశీయ ప్రయివేటు రంగ బ్యాంకుల్లో యస్ బ్యాంక్ అయిదో అతిపెద్ద బ్యాంక్. మొత్తం దేశీయ బ్యాంకింగ్ రుణాల్లో యస్ బ్యాంక్ వాటా 2.3 శాతంగా. డిపాజిట్ల వాటా 1.6 శాతంగా ఉంది.

లాభం నుండి రూ.18,564 కోట్ల నష్టాల్లోకి బ్యాంకు
ఇదిలా ఉండగా, అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో యస్ బ్యాంకు రూ.18,564 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. 2018లో ఇదే క్వార్టర్లో రూ.1000 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.629 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. సమీక్ష త్రైమాసికంలో మొత్తం రుణాల్లో నికర నిరర్థక ఆస్తుల నిష్పత్తి 18.87 శాతానికి పెరిగింది. ఏడాది క్రితం ఇది 7.39 శాతంగా ఉంది. మొండి బకాయిలకు కేటాయింపులు కూడా రూ.1336 కోట్ల నుండి రూ.24,765కు చేరుకున్నాయి.


Click it and Unblock the Notifications