యస్ బ్యాంక్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో రూ.2,500 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గురువారం జప్తు చేసింది. ఈ ఆస్తులు మొత్తం కూడా బ్యాంకు ఫౌండర్ రానాకపూర్, దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (DHFL) ప్రమోటర్లు కపిల్, ధీరజ్ వార్ధవాన్‌లకు చెందినవి. గత కొంతకాలంగా యస్ బ్యాంకు సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో నాలుగైదు నెలల క్రితం బ్యాంకు షేర్లు భారీగా పడిపోయాయి. ఆ తర్వాత ప్రభుత్వం, ప్రభుత్వరంగ బ్యాంకులు రంగంలోకి దిగాయి.

వివిధ దేశాల్లోని ఆస్తులు జఫ్తు
సమాచారం మేరకు రానాకపూర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ముంబై, ఢిల్లీ, లండన్, న్యూయార్క్ నగరాల్లో ఉన్న రూ.1,100 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే ముంబై, ఆస్ట్రేలియా, లండన్, పుణే నగరాల్లో వార్ధవాన్స్‌కు చెందిన ఆస్తులను కూడా అటాచ్ చేసింది. యస్ బ్యాంకుకు సంబంధించి ఈడీ త్వరలో రెండో ఛార్జీషీట్ దాఖలు చేసే అవకాశముంది. జఫ్తు చేసిన ఆస్తుల్లో విదేశాలకు చెందినవి కూడా ఉన్నాయి.

అటాచ్ చేసిన ఆస్తులు
మనీలాండరింగ నిరోధక (PMLA)చట్టం ప్రకారం ముంబైలోని పెద్దార్ రోడ్‌లోని ఓ బంగ్లా, ముంబైలోని ఖరీదైన మలబార్ హిల్ ప్రాంతంలోని 6 ఫ్లాట్లు, ఢిల్లీలోని అమృత షెర్గిల్ మార్గ్‌లోని 48 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అలాగే న్యూయార్క్‌లో ఒకటి, ఆస్ట్రేలియాలో ఒకటి, లండన్‌లో రెండు కమర్షియల్ ప్రాపర్టీలతో పాటు ఐదు లగ్జరీ కార్లు ఉన్నాయి.

క్విడ్ ప్రోకో
ఈ ఏడాది మే నెలలో యస్ బ్యాంకు ఫౌండర్ రానా కపూర్, ఆయన భార్య బిందూ కపూర్, కూతుళ్లు రోష్ని, రాఖీ, రాధాలపై ఈడీ ఛార్జీషీట్ దాఖలు చేసింది. రానా కపూర్, అతని ఫ్యామిలీ క్విడ్ ప్రోకు పాల్పడినట్లు ఈ ఛార్జీషీట్‌లో ఈడీ ఆరోపించింది. డీహెచ్ఎఫ్ఎల్ సహా వివిధ సంస్థలకు అనుమానాస్పద లోన్స్ ఇచ్చినట్లుగా పేర్కొంది. రానా కపూర్‌పై దర్యాప్తు చేస్తున్న ఈడీ, సీబీఐ ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు చేశాయి. రానాకపూర్, ఫ్యామీలీ, ఇతరులు రూ.4,300 కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్టు ఈడీ ఆరోపించింది. వీరు ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు.


Click it and Unblock the Notifications