యాహూ మెయిల్! మరింత స్టోరేజ్, మరిన్ని ఫీచర్లతో రీబ్రాండింగ్...
ఒకప్పుడు ఇంటర్నెట్ అంటే 'యాహూ'నే. ఇంటర్నెట్‌లో ఏం వెతకాలన్నా అందరూ మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ చేసి ముందుగా యాహూ సైట్ ఓపెన్ చేసేవారు. ఎవరికి ఈ-మెయిల్ అకౌంట్ ఉన్నా.. అది యాహూ మెయిల్‌లోనే. ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్‌గా, ఈ-మెయిల్‌కు పర్యాయపదంగా యాహూ ఒక వెలుగు వెలిగింది.
అయితే ఆ తరువాత ఇంటర్నెట్‌లోకి ఎక్స్‌ప్లోరర్‌కు పోటీగా ఇతర బ్రౌజర్లు ఎలాగైతే వచ్చాయో.. అదేమాదిరిగా ఈ-మెయిల్ విభాగంలోనూ ఇతర మెయిల్స్ రంగ ప్రవేశం చేశాయి. మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్, రెడిఫ్ మెయిల్, జీ మెయిల్ రంగప్రవేశం తరువాత వాటితో పోటీ పడలేక రేసులో యాహూ మెయిల్ వెనుకబడిపోయింది.

పూర్వ వైభవాన్ని అందుకునే ప్రయత్నాల్లో...
ప్రస్తుతం యాహూ మెయిల్ తన పూ ర్వ వైభవాన్ని సంపాదించుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగా సరికొత్త ఫీచర్స్‌తోపాటు తన మొబైల్ యాప్‌ను సైతం రీబ్రాండింగ్ చేయడం ద్వారా యూజర్లను ఆకర్షించేందుకు కసరత్తు చేస్తోంది. పోటీ సంస్థలైన గూగుల్‌కి చెందిన జీమెయిల్, మైక్రోసాఫ్ట్‌కు చెందిన అవుట్‌లుక్ వంటి వాటితో పోటీ పడేందుకు అవసరమైన అన్ని యత్నాలూ చేస్తోంది.

22 కోట్ల మంది నెలవారీ యూజర్లు...
ప్రస్తుతం యాహూ మెయిల్‌కు ప్రపంచవ్యాప్తంగా 22.76 మిలియన్ల మంది నెలవారీ యూజర్లు ఉన్నారు. మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు మొదలైన వివిధ డివైజ్‌ల ద్వారా వీరంతా యాహూ మెయిల్ సర్వీసులు ఉపయోగించుకుంటున్నారు. మొత్తం యూజర్లలో ప్రతి నెలా 7.5 కోట్ల మంది యూజర్లు కేవలం తమ మొబైల్స్, ట్యాబ్లెట్స్ ద్వారానే యాహూ మెయిల్‌ను ఉపయోగిస్తున్నారు.

సరికొత్త మొబైల్ యాప్‌తో...
యాహూ మెయిల్ వినియోగదారుల్లో 60 శాతం మంది అమెరికాయేతర దేశాలవారే. ప్రస్తుతం ఉన్న యూజర్లు మరో ఈ మెయిల్ సేవల సంస్థ వైపు ఆకర్షితులవకుండా.. వారిని తన వద్దే అట్టిపెట్టుకునే దిశగా యాహూ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం తన మొబైల్ యాప్‌ను సరికొత్త ఫీచర్లతో తీర్చిదిద్దుతోంది. మన దేశంలో తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, గుజ రాతీ, బెంగాలీ, మరాఠీ వంటి ఏడు ప్రాంతీయ భాషల్లోనూ యాహూ మెయిల్ సేవలు అందిస్తోంది.

1 టీబీ ఉచిత స్టోరేజ్ స్పేస్...
ఈ-మెయిల్ వినియోగదారులకు ప్రధానంగా కావలసింది అత్యధిక స్టోరేజ్. ఇప్పటి వరకు ఈ విభాగంలో యాహూకు ప్రధాన ప్రత్యర్థి అయిన జీ మెయిల్ తన వినియోగదారులకు ఇస్తోన్న ఉచిత స్టోరేజి 15 జీబీ. ఈ పరిమితి దాటితే.. మెయిల్ బాక్స్ ఉన్న అనవసరపు మెయిల్స్‌ను డిలీట్ చేసుకోవాల్సిందే. లేదంటే నెలవారీగా కొంత మొత్తం చెల్లించి అదనపు స్టోరేజ్ కొనుగోలు చేయాల్సిందే. సరిగ్గా ఇక్కడే యాహూ తన ప్రత్యర్థులను పెద్ద దెబ్బకొట్టింది. తాజాగా తన మెయిల్ యూజర్లకు అత్యధికంగా 1 టెరాబైట్(టీబీ) ఉచిత స్టోరేజ్ స్పేస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ఎంత స్టోరేజ్ అంటే.. యాహూ మెయిల్ యూజర్లు వారి మెయిల్‌లో సుమారు 250 నుంచి 300 వరకు సినిమాలు స్టోర్ చేసుకోగలిగేంత.

స్పామ్ బాదరబందీ లేకుండా...
ఇక, మెయిల్ ఇన్‌బాక్స్‌లో స్పామ్ బాదరబందీ లేకుండా కాంటాక్ట్స్ నుంచి వచ్చే మెయిల్స్ మాత్రమే కనిపించేలా.. యాహూ మెయిల్ యూజర్లు..‘పీపుల్ వ్యూ' పేరిట మరో కొత్త ఫీచర్ వినియోగించుకోవచ్చు. అలాగే ఇన్‌బాక్స్‌లోని మెయిల్స్‌ను పీపుల్, ట్రావెల్, రిసీట్స్ అనే మూడు కేటగిరీల కింద విడగొట్టుకోవచ్చు. అంతేకాదు, ఇంకా పలు రకాల ఫిల్టర్స్, అటాచ్‌మెంట్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఇతర ఈ-మెయిల్ సర్వీస్ ప్రొవైడర్స్ తరహాలోనే యాహూ మెయిల్ యూజర్లు కూడా మెయిల్ యాప్‌కు బహుళ ఈ-మెయిల్ ఖాతాలను అనుసంధానించుకోవచ్చు.

మెయిల్ ప్రో రీబ్రాండింగ్...
యాహూ మెయిల్ తన యూజర్లకు మెయిల్ సర్వీసులను ఉచితంగా అందిస్తున్నప్పటికీ.. మెయిల్స్‌లో ప్రకటనలు కూడా పెడుతుంది. వీటి ద్వారా యాహూ మెయిల్‌కు కొంత ఆదాయం లభిస్తుంది. అయితే ఈ ప్రకటనల బాదరబందీ లేని సబ్‌స్క్రిప్షన్ ఆధారిత యాహూ మెయిల్ ప్రో సర్వీసు కూడా ఉంది. దాదాపు ఆరేడేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఈ సర్వీసును ప్రస్తుతం యాహూ మెయిల్ రీబ్రాండ్ చేసే ప్రయత్నాల్లో ఉంది. అలాగే, మొబైల్ ఫోన్స్‌లో ప్రీ-ఇన్‌స్టాల్ యాప్స్‌లో సరికొత్త యాహూ మెయిల్ యాప్‌ను కూడా ఉంచేందుకు ఆయా మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలతోనూ చర్చలు జరుపుతోంది.