ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) డైరెక్టర్ జనరల్ రాబర్ట్ అజెవెడో హఠాత్తుగా.. తన పదవీ కాలం పూర్తికాకముందే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఆగస్ట్ 31 తర్వాత తేదీ నుండి ఆయన రాజీనామా అమలులోకి వస్తుంది. ఆయన పదవీ కాలం వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు ఉంది. నాలుగేళ్ల పదవీ కాలానికి గాను ఆయన ఆగస్ట్ నాటికి అంటే మూడేళ్లకే తప్పుకుంటున్నారు.

రాబర్ట్ ఏం చెప్పారు?
రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించిన రాబర్ట్ అజెవెడో ఆ తర్వాత WTO ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ నిర్ణయాన్ని తాను తేలిగ్గా తీసుకోలేదని, ఇది ఒక వ్యక్తిగత, కుటుంబ నిర్ణయమని చెప్పారు. సంస్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తాను ఈ పని చేసినట్లు తెలిపారు. దీనిపై WTO ఓ ప్రకటన చేస్తుందని సంస్థ అధికార ప్రతినిధి ఆ తర్వాత వెల్లడించారు.

రెండోసారి అధిపతిగా మాజీ దౌత్యవేత్త
62 సంవత్సరాల బ్రెజిలియన్ రాబర్ట్ అజెవెడో. ఆయన బ్రెజిల్ మాజీ ప్రభుత్వాధికారి. దౌత్యవేత్తగా పని చేశారు. 2013లో మొదటిసారి ప్రపంచ వాణిజ్య సంస్థ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రెండోసారి పొడిగింపు జరిగింది. 2021 సెప్టెంబర్ నెలలో పదవీకాలం ముగియనుంది. కానీ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికే తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.

కీలక సమయంలో రాజీనామా
కరోనా మహమ్మారి అంతర్జాతీయవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీసింది. అగ్రరాజ్యం అమెరికా సహా ఆర్థిక కార్యకలాపాలు లేక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. ఇలాంటి కీలక పరిస్థితుల్లో ఆయన తప్పుకుంటున్నారు. ఇప్పటికే అమెరికా - చైనా ట్రేడ్ వార్, ఆ తర్వాత బ్రెగ్జిట్ ఇప్పుడు కరోనా.. ఇలా వరుస ఉపద్రవాలు ప్రపంచ దేశాలను కకలావికళం చేస్తున్నాయి. 1930 తర్వాత మరోసారి ప్రపంచం మహామాంద్యంలోకి వెళ్తోంది.

ట్రంప్ ఒత్తిళ్లు కారణమా?
25 సంవత్సరాల ఈ సంస్థ చరిత్రలో పదవీ కాలానికి ముందుగానే ఎప్పుడూ ఆ కుర్చీ ఖాళీగా లేదు. సాధ్యమైనంత త్వరలో ఆ స్థానాన్ని భర్తి చేసేందుకు ప్రక్రియ ప్రారంభం కానుంది. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ నుండి తీవ్ర ఒత్తిళ్లు ఆయన తప్పుకోవడానికి కారణంగా ప్రచారం సాగుతోంది. అమెరికాకు ప్రతికూల ధోరణిలో WTO వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications