WPI Inflation: ప్రజలకు భారీ ఉపశమనం.. కనిష్ఠాలకు హోల్ సేల్ ద్రవ్యోల్బణం..!
WPI Inflation: అనేక నెలలుగా దేశంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు ఉక్కిరిబిక్కిరి చేసింది ద్రవ్యోల్బణం. దీంతో ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపును భారీగా కొనసాగించాయి. అనేక నెలల వరుస పోరాటం తర్వాత ద్రవ్యోల్బణం వేడి తగ్గుతోంది.
టోకు ధరల సూచీ(WPI) ద్రవ్యోల్బణం మార్చి 2023లో 1.34 శాతానికి దిగొచ్చింది. దీనికి ముందు ఫిబ్రవరి 2023లో హోల్ సేల్ ధరల ద్రవ్యోల్బణం 3.85 శాతంగా, జనవరిలో 4.80 శాతంగా నమోదైనట్లు వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఈ క్రమంలో మార్చిలో ద్రవ్యోల్బణం తగ్గుదల 29 నెలల కనిష్ఠానికి చేరుకుంది.

ప్రధానంగా మార్చి 2023లో బేసిక్ మెటల్స్, ఆహార ఉత్పత్తులు, వస్త్రాలు, ఆహారేతర వస్తువులు, ఖనిజాలు, రబ్బరు అండ్ ప్లాస్టిక్ ఉత్పత్తులు, ముడి పెట్రోలియం, సహజ వాయువు, కాగితం & కాగితం ఉత్పత్తుల ధరలు తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో ఇంధనం, విద్యుత్ విభాగంలో డబ్ల్యుపీఐ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 14.82 శాతం నుంచి ఈ ఏడాది మార్చిలో 8.96 శాతానికి తగ్గింది.

భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం లేదా వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం(CPI) ఫిబ్రవరిలో 6.44 శాతంతో పోలిస్తే.. మార్చిలో 5.66 శాతానికి తగ్గటంతో 15 నెలల కనిష్ఠానికి చేరుకుంది. పారిశ్రామికోత్పత్తి సూచీ(IIP) ఆధారంగా భారత ఫ్యాక్టరీ ఉత్పత్తి ఫిబ్రవరిలో స్వల్పంగా పెరిగి 5.6 శాతంగా నమోదైంది.


Click it and Unblock the Notifications