WPI Inflation: టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరి 2023లో 25 నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. తాజాగా ఇది 3.85 శాతానికి క్షీణించింది. తయారీ వస్తువులు, ఇంధనం, విద్యుత్ ధరల సడలింపుపై ప్రభుత్వ గణాంకాలు మంగళవారం వెల్లడయ్యాయి. డబ్ల్యూపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గడం వరుసగా ఇది తొమ్మిదో నెల కావటం గమనార్హం.
టోకు ధరల ద్రవ్యోల్బణం జనవరిలో 4.73 శాతం, 2022 డిసెంబర్ లో 4.95 శాతం ఉండగా ఫిబ్రవరి 2022లో 13.43 శాతంగా ఉంది. ఆహార సూచీ ద్రవ్యోల్బణం జనవరిలో 2.95 శాతం నుంచి ఫిబ్రవరిలో 2.76 శాతానికి తగ్గింది.

ఫిబ్రవరి 2023లో ద్రవ్యోల్బణం క్షీణతకు ప్రధానంగా ముడి పెట్రోలియం & సహజ వాయువు, ఆహారేతర వస్తువులు, ఆహార ఉత్పత్తులు, ఖనిజాలు, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ & ఆప్టికల్ ఉత్పత్తులు, రసాయనాలు & రసాయన ఉత్పత్తులు, విద్యుత్ పరికరాలు, మోటారు వాహనాలు, ట్రైలర్‌లు & సెమీ ట్రైలర్‌లు కారణమని వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం జనవరిలో 2.38 శాతం నుంచి ఫిబ్రవరిలో 3.81 శాతానికి పెరిగింది. పప్పుధాన్యాల ద్రవ్యోల్బణం 2.59 శాతంగా ఉండగా.. కూరగాయల్లో (-) 21.53 శాతంగా ఉంది. నూనె గింజల ద్రవ్యోల్బణం గత నెలలో (-) 7.38 శాతంగా ఉండగా, పండ్లలో 7.02 శాతంగా ఉంది. WPIలో తగ్గుదల రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదలకు అనుగుణంగా జరిగింది. తాజాగా విడుదలైన సీపీఐ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం.. జనవరిలో 6.52 శాతం నుంచి ఫిబ్రవరిలో 6.44 శాతానికి తగ్గింది. గత నెలలో జరిగిన ఎంపీసీ సమావేశంలో రిజర్వు బ్యాంక్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచటంతో అది 6.50 శాతానికి చేరుకుంది.


Click it and Unblock the Notifications