Duty on Gold: ప్లీజ్ నిర్మలమ్మ మా మాట విను.. పసిడిపై దిగుమతి సుంకాలు పెంచొద్దు..!
Budget 2025: భారతీయులకు పసిడికి మధ్య సంబంధం విడదీయలేదనిదని మనందరికీ తెలిసిందే. అందుకే ఇంట్లో ఏ చిన్న శుభకార్యం ఉన్నప్పటికీ దానికోసం పసిడి కొనుగోళ్లు చేపడుతుంటారు. చిన్న మెుత్తంలో అయినా గోల్డ్ కొనుగోలు చేయటం సర్వసాధారణంగా మారిపోయింది.
వాస్తవానికి గత బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలోని పసిడి ప్రియుల కోసం పెద్ద ప్రకటన చేశారు. ఆ సమయంలో బంగారంపై ఉన్న దిగుమతి సుంకాన్ని ఏకంగా 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ తగ్గింపు బంగారానికి డిమాండ్ పెంచేసింది. కొందరు తమ పెట్టుబడి అవసరాల కోసం బిస్కెట్లు, బార్లను కొనుగోలు చేస్తుండగా.. చాలా మంది శుభకార్యాలు, ఇతర అవసరాల కోసం ఆభరణాల రూపంలో గోల్డ్ కూడబెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో భారీగా దిగుమతులు పెరగటంతో మళ్లీ సుంకాలు పెంచుతారనే భయాలు తిరిగి మెుదలయ్యాయి.

ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలను కనిపెడుతూ ఉండే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రాబోయే బడ్జెట్‌లో బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచవద్దని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దిగుమతులపై పన్ను పెంపు ప్రతికూల ప్రభావాన్ని చూపి గోల్డ్ పరిశ్రమతో పాటు ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుందని హెచ్చరించింది. వాస్తవానికి గత బడ్జెట్ సమయంలో దిగుమతులపై పన్నును భారీగా తగ్గించటం సానుకూల ప్రభావాన్నే చూపించిందని డబ్ల్యుజీసీ ప్రాంతీయ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సచిన్ జైన్ పేర్కొన్నారు. పన్నులు తిరిగి పెంచితే అక్రమ రవాణా, స్మగ్లింగ్ పెరగొచ్చని అభిప్రాయపడ్డారు.
వాస్తవానికి భారత జీడీపీలో బంగారు ఆభరణాల పరిశ్రమ 1.3 శాతం వాటాను కలిగి ఉంది. దేశంలో ఈ పరిశ్రమ దాదాపు 20-30 లక్షల మందికి ఉపాధి అవకాశాన్ని కల్పిస్తోంది. జూలైలో పన్ను తగ్గింపులు అధికారికంగా దిగుమతి చేసుకునే బంగారాన్ని భారీగానే పెంచింది. ఇది పరిశ్రమలో పారదర్శకతను పెంచుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. ఇది భారతదేశ ఆర్థిక వృద్ధి, శ్రేయస్సుకు గణనీయంగా దోహదపడుతుందని జైన్ పేర్కొన్నారు.
అటు గోల్డ్ ఇండస్ట్రీకి, ఇటు వినియోగదారులకు అనుకూలమైన ప్రకటన ఈసారి బడ్జెట్లో కోరుకుంటున్నట్లు జైన్ వెల్లడించారు. పన్నులను అమాంతం పెంచే ప్రయత్నం చేయటం పరిశ్రమను దెబ్బతీస్తుందని అన్నారు. డిసెంబర్ 2024లో భారత్ 4.7 బిలియన్ డాలర్లు విలువైన పసిడిని దిగుమతి చేసుకుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ అందించిన లెక్కల ప్రకారం తెలుస్తోంది. సగటున ఏటా ఇండియాలోకి దాదాపు 800 కేజీల వరకు బంగారం దిగుమతు చేసుకోబడుతుంది. ధరలు తక్కువగా ఉంటే ప్రజల నుంచి డిమాండ్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రకటించే బడ్జెట్లో నిర్మలమ్మ ఈ విజ్ఞప్తిని ఎంతవరకు పరిగణిస్తారనే విషయం తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications