ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో కోలుకోదు, షాకింగ్ రిపోర్ట్: భారత ఆర్థిక వ్యవస్థపై ఏమన్నారంటే?
అమెరికన్ బిజినెస్ సర్వీసెస్ సంస్థ డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్(D&B) ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి ప్రభావాన్ని అంచనా వేసింది. దీని ప్రకారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2022 నాటికి కూడా కరోనా మహమ్మారి ముందుస్థాయికి వచ్చే అవకాశం లేదని అభిప్రాయపడింది. కరోనాబారిన పడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదని, మరో రెండేళ్ల వరకు ఇవే పరిస్థితులు ఉండవచ్చునని డీ అండ్ బీ గ్లోబల్ చీఫ్ ఎకనమిస్ట్ అరుణ్ సింగ్ అభిప్రాయపడ్డారు.
చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలను ఇంకా కరోనా ప్రభావితం చేస్తోందని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ కంట్రీ రిస్క్, గ్లోబల్ ఔట్ లుక్‌లో పేర్కొంది. నిరుద్యోగం పెరుగుతోందని, దేశంలో కరోనా రికవరీ బాగున్నప్పటికీ కేసులు అంతకంతకూ పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

కరోనాకు ముందుస్థాయికి చాలా సమయం
ఆసియా పసిఫిక్ దేశాల ఆర్థిక వ్యవస్థలు, గణాంకాలు ఆందోళనను కలిగిస్తున్నాయని చెబుతున్నారు. సౌత్ కొరియా మరోసారి లాక్ డౌన్ దిశగా ఆలోచన చేస్తోంది. జపాన్‌లో కేసులు పెరుగుతున్నాయి. కరోనా ప్రభావం ఎక్కువగా లేని తైవాన్ ప్రాంత ఆర్థిక వ్యవస్థ కూడా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన దారుణంగా చితికిపోయిందని గుర్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2022 నాటికి కరోనా ముందుస్థాయికి వచ్చే పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదంటున్నారు.

పుంజుకుంటున్నట్లు కనిపించినా
కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతూ ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న సమయంలో అన్ని దేశాల ప్రభుత్వాలు కార్మికుల సంరక్షణ కోసం చేపట్టే చర్యలు క్రమంగా తగ్గిపోతాయని, మరోవైపు నిరుద్యోగిత రేటు పెరిగే అవకాశముందని, ఇంకోవైపు మూడో క్వార్టర్‌లో కాస్త పుంజుకున్నట్లు కనిపించినా నాలుగో క్వార్టర్‌లో మళ్లీ క్షీణించే అవకాశాలు కొట్టి పారేయలేమని అరుణ్ సింగ్ చెబుతున్నారు.

భారత ఆర్థిక వ్యవస్థపై..
భారత ఆర్థిక వ్యవస్థ గురించి అరుణ్ సింగ్ మాట్లాడుతూ... హెల్త్ కండిషన్ పైన ఆర్థిక రికవరీ ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా కోలుకుంటున్నట్లు కనిపించినప్పటికీ, రికవరీ రేటు పెరుగుతున్నట్లు చూపించినప్పటికీ, సుదీర్ఘ లాక్ డౌన్ వంటి చర్యల వల్ల రెండో త్రైమాసికం, మూడో త్రైమాసికంలో బలహీనపడవచ్చునని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే వినియోగ డిమాండ్ తగ్గిందని, పెట్టుబడులపై కరోనా సంబంధిత లాక్ డౌన్ ప్రభావం పడి తొలి త్రైమాసికంలో జీడీపీ 23.9 శాతం క్షీణించిందని గుర్తు చేశారు. ఉపాధి విషయానికి వస్తే అన్ని దేశాల్లోను క్రమంగా క్షీణిస్తోందన్నారు.


Click it and Unblock the Notifications