Amaravati: అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు! ఖాతాలో పడ్డ రూ. 2,800 కోట్లు.. నెక్స్ట్ ప్లాన్ ఇదే!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణ పనులు శరవేగంగా పుంజుకుంటున్నాయి. అమరావతి రాజధాని ఫేజ్-1 అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంక్ (World Bank) ఇప్పటికే సుమారు 340 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 2,800 కోట్లు) నిధులను విడుదల చేసింది. దీనికి తోడు ఏప్రిల్ నెలాఖరు నాటికి మరో 150 మిలియన్ డాలర్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి అందే అవకాశం ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రాజెక్టుకు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి పూర్తిస్థాయి మద్దతు లభిస్తోంది.

వరల్డ్ బ్యాంక్ , ఏడీబీ భారీ ఒప్పందం
అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (AIUDP) కోసం ప్రపంచ బ్యాంక్ , ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) చెరో 800 మిలియన్ డాలర్ల చొప్పున, మొత్తం 1,600 మిలియన్ డాలర్ల రుణాన్ని అందించడానికి అంగీకరించాయి. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతుగా రూ.15,000 కోట్ల నిబద్ధతలో భాగంగా ప్రాథమికంగా రూ.1,400 కోట్లను విడుదల చేస్తోంది. ఈ రుణాల వడ్డీ రేటు అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రకారం సుమారు 8% నుంచి 8.5% మధ్య ఉండవచ్చని తెలుస్తోంది.
మైలురాళ్ల ఆధారంగానే నిధుల విడుదల
వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నిధులు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం కాకుండా, అభివృద్ధి పనుల పురోగతిని బట్టి (Results framework) విడుదల చేయబడతాయి. అంటే ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యాలను చేరుకున్నప్పుడే తదుపరి విడత నిధులు అందుతాయి. ఈ రుణానికి 6 సంవత్సరాల గ్రేస్ పీరియడ్ , 29 సంవత్సరాల మెచ్యూరిటీ కాలం ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ అప్పు తిరిగి చెల్లించడం జూన్ 15, 2031 నుంచి ప్రారంభమవుతుంది.
గ్రౌండ్ లెవల్‌లో శరవేగంగా సాగుతున్న పనులు
గత 14 నెలలుగా అమరావతిని ఒక సమ్మిళిత నగరంగా మార్చడానికి అవసరమైన కసరత్తులు జరుగుతున్నాయి. ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టారు..
- వరద నిర్వహణ: ఆరు ప్రధాన ప్రాంతాల్లో ఇప్పటికే 35% వరద నివారణ పనులు పూర్తయ్యాయి.
- రోడ్ల నెట్‌వర్క్: నగరవ్యాప్తంగా ఆర్టీరియల్ రోడ్లు, నివాస గృహాల నిర్మాణం కోసం కాంట్రాక్టర్లు రంగంలోకి దిగారు.
- నీటి సరఫరా, డ్రైనేజీ: అత్యాధునిక మురుగునీటి నిర్వహణ , తుపాను నీటి కాలువల వ్యవస్థను నిర్మిస్తున్నారు.
ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత
కేవలం భవనాలు నిర్మించడమే కాకుండా, అమరావతిని ఒక ఆర్థిక కేంద్రంగా మార్చాలని వరల్డ్ బ్యాంక్ భావిస్తోంది. ఇందులో భాగంగా స్థానిక యువతకు, ముఖ్యంగా మహిళలకు ఉద్యోగ ఆధారిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను (Skilling programmes) ప్రారంభిస్తున్నారు. భవిష్యత్తులో ఈ నగరం పెట్టుబడిదారులను ఆకర్షించేలా, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించేలా మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌ను సిద్ధం చేస్తున్నారు. క్లైమేట్-రెసిలెంట్ (వాతావరణ మార్పులను తట్టుకునే) నగరంగా అమరావతి చరిత్రలో నిలిచిపోనుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఏదేమైనా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న అమరావతి నగరం ఏపీ ఆర్థిక వృద్ధికి ఇంజిన్‌లా మారబోతోంది. ప్రపంచ బ్యాంక్ , ఏడీబీ మద్దతుతో ప్రాథమిక మౌలిక సదుపాయాల పనులు వేగవంతం కావడం ఇన్వెస్టర్లలో కూడా భరోసాను నింపుతోంది. ఏప్రిల్‌లో అందబోయే అదనపు నిధులతో రాజధాని రూపురేఖలు మరింత వేగంగా మారనున్నాయి.


Click it and Unblock the Notifications