World Bank on GDP: ఆర్థిక అనిశ్చితుల మధ్య ప్రపంచ వ్యాప్తంగా చీకట్లు అలుముకున్న వేళ భారత్ ప్రకాశిస్తోంది. అందుకే అనేక దేశాలు తమ పెట్టుబడులకు ఇండియా మార్కెట్లను ఎంచుకుంటున్నాయి.
ఈ క్రమంలో ప్రపంచ బ్యాంక్ సైతం భారత వృద్ధిపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 6.3% వృద్ధి చెందుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ప్రపంచ ఆందోళనల మధ్య అక్టోబర్ 3న ప్రపంచ బ్యాంకు ఈ నివేదికను విడుదల చేసింది. రానున్న రెండేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ 6.4 శాతం, 6.5 శాతం చొప్పును ముందుకు సాగుతుందని వరల్డ్ బ్యాంక్ తన తాజా నివేదికలో పొందుపరిచింది.

దేశీయ సర్వీస్ రంగం బలం అలాగే కొనసాగుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఈ రంగం 7.4 శాతం రేటుతో వృద్ధి చెందుతుందని పేర్కొంది. గడచిన ఐదేళ్లతో పోల్చితే ఈ ఏడాది దేశంలో రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. దీని వల్ల వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని తన అంచనాలను వెల్లడించింది. దీని ఫలితంగా ఆహార ద్రవ్యోల్బణం కొన్ని నెలలుగా పెరుగుతోందని నివేదించింది. అయితే రానున్న కొద్ది నెలల్లో ఇది తగ్గుముఖం పడుతుందని ప్రపంచ బ్యాంకు విశ్వసిస్తోంది.
కొత్త ఆర్థిక సంవత్సరం మెుదటి త్రైమాసికంలో భారత వృద్ధి రేటు 7.8 శాతం రేటుతో వృద్ధి చెందిందని ఇటీవలి గణాంకాలను ప్రపంచ బ్యాంక్ ప్రస్థావించింది. ఇది ఆర్థికవేత్తల అంచనా 7.7 శాతం కంటే ఎక్కువ కావటం విశేషం. అయితే ఇది రిజర్వ్ బ్యాంక్ అంచనా 8 శాతం కంటే 20 బేసిస్ పాయింట్లు తక్కువగా ఉంది. మెుత్తానికి ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్ మంచి ఆర్థిక వృద్ధి రేటుతో పయనిస్తూ మెరుగైన పనితీరును కనబరచటం అందరినీ ఆకర్షిస్తున్న అంశం.


Click it and Unblock the Notifications