world bank: ప్రపంచ GDP వృద్ధిపై వరల్డ్ బ్యాంకు షాకింగ్ రిపోర్ట్.. ఈ దశాబ్దంలో ఎంతగా తగ్గనుందంటే..
world bank: ఓ దేశ ఆర్థిక వృద్ధిని అంచనా వేయడంలో GDPకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇటీవల నెలకొన్న కొవిడ్ విజృంభణ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి. ప్రపంచ వృద్ధి అంచనాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. ఈ దశాబ్దంలో అంతర్జాతీయ వృద్ధిపై ప్రపంచ బ్యాంక్ ఓ ప్రకటన చేసింది.
మసకబారనున్న ఆర్థిక శక్తులు:
కరోనా విలయతాండవం, యుద్ధాల తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందకోడిగా సాగుతోందని ప్రపంచ బ్యాంకు నివేదించింది. 2000-10 కంటే 2022-30లో మరింత నెమ్మదించినట్లు తెలిపింది. ఈ మేరకు "ఫాలింగ్ లాంగ్-టర్మ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్: ట్రెండ్స్, ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ పాలసీలు" పేరిట ఓ నివేదికను విడుదల చేసింది. 2000-10లో వృద్ధిని పెంచిన ఆర్థిక శక్తులు 2022-30లో మసకబారుతాయని విశ్లేషించింది.

అప్పుడు 6, ఇప్పుడు 4:
2022-30 మధ్య సగటు వృద్ధిని నివేదిక అంచనా వేసింది. ఇది సంవత్సరానికి 2.2 శాతానికి తగ్గుతుందని వరల్డ్ బ్యాంకు భావిస్తోంది. కాగా 2000-10 రేటులో ప్రస్తుతం దాదాపు మూడింట ఒక వంతు ఉండనున్నట్లు పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాల వృద్ధి అప్పుడున్న 6 శాతంతో పోలిస్తే 2022-30లో ఏడాదికి 4 శాతం వరకు క్షీణించవచ్చన్న సూచనలు మరింత ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిపింది.
ఇవీ కారణాలు:
ఆర్థిక సంక్షోభం, మాంద్యం పరిస్థితులు ఈ సంక్షోభాన్ని మరింత దిగజార్చవచ్చని ప్రపంచ బ్యాంకు భావిస్తోంది. వెరసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 'లాస్ట్ డికేడ్'గా మిగలవచ్చని వరల్డ్ బ్యాంకు చీఫ్ ఎకనామిస్ట్ ఇందర్మిట్ గిల్ అన్నారు. పేదరికం, ఆదాయాల్లో వ్యత్యాసం మరియు వాతావరణ మార్పులు వృద్ధిలో సంభావ్య క్షీణతకు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. పనిని ప్రోత్సహించడం, ఉత్పాదకతను పెంచడం మరియు పెట్టుబడిని వేగవంతం చేయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగ పరిమితిని పెంచవచ్చు అని అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications