పనిదినాల కుదింపుకు పెరుగుతున్న డిమాండ్.. ఆ కంపెనీలో వారానికి 3 రోజులు పనిచేస్తే చాలు..
Working days: ఎప్పుడూ వర్క్ టెన్షన్స్ తో సతమతమవుతూ ఉండే వేతన జీవులకు వారాంతపు శెలవు కొంత ఉపశమనం ఇస్తోంది. సరదాగా కుటుంబ సభ్యులతో సమయం గడిపే అవకాశం లభిస్తోంది. గతంలో పని దినాలు, వేళలు గురించి అంతగా పట్టించుకునే వారు కాదు. కానీ మారుతున్న ఆలోచనా ధోరణికి అనుగుణంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విలువను ఉద్యోగులు తెలుసుకుంటున్నారు.
ఆదివారం శెలవు దినం నుంచి క్రమంగా వారానికి 5 రోజులు పనిచేసేందుకు దేశంలో పలు కంపెనీలు అప్ గ్రేడ్ అయ్యాయి. ఈ తరహా పనివిధానం ముఖ్యంగా IT రంగంలో ఎక్కువగా చూడొచ్చు. ఇండియాలో బ్యాంకింగ్, LIC వంటి ఇతర రంగాలకు ఇది విస్తరించినా, ఇప్పటికీ చాలా వరకు కంపెనీలు 6 రోజుల విధానాన్నే అనుసరిస్తున్నాయి.

1926లో హెన్రీ ఫోర్డ్ మొదటగా 5 రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టినట్లు చెబుతారు. అనంతరం ఈ పద్ధతి వివిధ దేశాలకు విస్తరించింది. ఆయా కార్పొరేట్ సంస్థలు దీనిపై పరిశోధనలు కూడా జరిపాయి. పని దినాలు తగ్గించడం వల్ల ఉత్పాదకత పెరగడంతో పాటు ఆయా సంస్థల ఆదాయంలోనూ గణనీయమైన మార్పులు వచ్చినట్లు వారి రీసెర్చ్ లో తేలింది. దీంతో పలు కార్పొరేట్స్ 5 రోజుల పని విధానానికి మారాయి.
ఈ 5 రోజులను కాస్తా 4, 3 పని దినాలకు కుదించాలనే డిమాండ్ సైతం ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది. కొన్ని కంపెనీలు ఇప్పటికే మారాయి కూడా. ముఖ్యంగా 5 రోజుల పాటు పనిచేస్తున్న ఇండియన్ IT సెక్టార్ ఉద్యోగులు.. 4 రోజులకు తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిని అర్థం చేసుకున్న ఫిన్ టెక్ కంపెనీ స్లైస్ ఏకంగా 3 రోజులకు సిబ్బంది పని దినాలను కుదించి చరిత్ర సృష్టించింది.


Click it and Unblock the Notifications