"ఆదివారం కూడా ఉద్యోగులు పనిచేయాలి" అన్న మాట ఒక్కటే ఎల్‌అండ్‌టి చైర్మన్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఉద్యోగుల నుండి విమర్శలు, సోషల్ మీడియాలో వ్యతిరేక స్పందనలు రావడంతో చివరకు ఆయనే ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు.

ఎల్‌అండ్‌టి (Larsen & Toubro) చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ "ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్" ఆదివారం ఉద్యోగులు పనిచేయాలని చేసిన వివాదాస్పద వ్యాఖ్యపై చివరకు స్పందించారు. ఆ వ్యాఖ్యను తాను సరదాగా, కేవలం సంభాషణలో భాగంగా మాత్రమే చేసినట్టు ఆయన స్పష్టం చేశారు.
సుబ్రహ్మణ్యన్ చెప్తునట్టు తాజాగా ఐదారు క్లయింట్లు, అందులో కూడా కొందరు చాలా పేరున్న, హై-ప్రొఫైల్ వ్యక్తులు నన్ను నేరుగా సంప్రదించారు. వారు ప్రాజెక్టుల ప్రగతిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు ఫోన్ ద్వారా కాల్ చేసి అడిగారు, మరికొందరు ఇమెయిల్ ద్వారా పనులు ఎందుకు ఆగిపోయాయో ప్రశ్నించారు.
ఇలాంటి స్పందనలు రావడంతో నాకు కూడా చాలా ఆందోళన కలిగింది. ఎంత ప్రయత్నించినా అవసరమైన సిబ్బంది, కార్మికులు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడం సాధ్యపడలేదు. ఫలితంగా పనులు నిరంతరంగా ఆలస్యం అవుతున్నాయి.
ఈ పరిస్థితి నాకు వ్యక్తిగతంగా ఒత్తిడిని కలిగించడమే కాకుండా, మా సంస్థకు కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ప్రాజెక్టులు ఆగిపోవడం వలన కస్టమర్ల విశ్వాసం దెబ్బతింటుంది, కంపెనీ ప్రతిష్ఠ కూడా దెబ్బతింటుందని ఆయన తెలిపారు.
వివాదంపై సుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ "ఆ మాట ఎందుకు అన్నానంటే... ఒకరు నన్ను ప్రశ్నించినప్పుడు నేను సరదాగా మాట్లాడాను. కానీ ఆ సంభాషణను రికార్డు చేయడం నియమాలకు విరుద్ధం. ముందుగానే రికార్డింగ్ చేయకూడదని హెచ్చరిక ఉన్నప్పటికీ చేశారు. ఇప్పుడు తిరిగి ఆలోచిస్తే, నేను వేరేలా సమాధానం చెప్పి ఉండేవాణ్ణి. నేను ఎప్పుడూ సింపుల్‌గా, స్నేహపూర్వకంగా మాట్లాడుతాను అదే నా శైలి. అయితే ఈ సందర్భంలో వేరేలా చెప్పి ఉండాలి. ఈ విషయంతో నా భార్య కూడా బాధపడింది, ఎందుకంటే ఆమె పేరునూ కూడా ఇందులోకి లాగారు" అని ఆయన చెప్పారు.
"ఈ ఘటన నన్ను బాగా కలచివేసింది. మానసికంగా కూడా ఒత్తిడిని కలిగించింది. అయితే జరిగింది జరిగిపోయింది, వెనక్కి తీసుకోలేను. అదే పరిస్థితి మళ్లీ ఎదురైతే నేను తప్పకుండా వేరేలా స్పందిస్తాను. ఆ సమయంలో పనితీరు సరిగా లేకపోవడం వల్లనే అలా బయటపెట్టాను. మా దగ్గర పర్ఫార్మెన్స్ అంటే ఆక్సిజన్ లాంటిది. అది లేనప్పుడు మాటల్లో పొరపాట్లు జరుగుతాయి అని ఆయన చెప్పారు.
గత నెలలో వచ్చిన ఎల్‌అండ్‌టి వార్షిక నివేదిక ప్రకారం, సుబ్రహ్మణ్యన్ వేతనం దాదాపు 50% పెరిగింది. 2024లో ఆయన వేతనం రూ. 51.05 కోట్లు ఉండగా, 2025లో అది రూ. 76.25 కోట్లకు చేరింది. ఈ పెరుగుదలలో ఎక్కువ భాగం స్టాక్ ఆప్షన్ల వల్లే వచ్చిందని కంపెనీ తెలిపింది.
సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై కొంతమంది ఉద్యోగులు, కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. "ఆదివారం కూడా పని చేయాలి" అన్న వ్యాఖ్యపై సోషల్ మీడియాలో విమర్శలు, చర్చలు వచ్చాయి. కొంతమంది ఉద్యోగులు "వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కి విరుద్ధం"గా భావించారు. కార్మిక సంఘాలు కూడా "ఆదివారం పని అంటే ఉద్యోగుల విశ్రాంతి హక్కు దెబ్బతింటుంది" అని స్పష్టంగా విమర్శించాయి. అంతేకాకుండా, ఉద్యోగి పనితీరును మాత్రమే కాకుండా, అతని ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, కుటుంబ జీవితం వంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ట్విట్టర్, లింక్డ్‌ఇన్‌లలో చాలామంది "ఉద్యోగులు యంత్రాలు కారు" అని రాసారు. కొందరు వినియోగదారులు "ఇలాంటి వ్యాఖ్యలు ఉద్యోగులపై అనవసర ఒత్తిడి పెంచుతాయి" అని పేర్కొన్నారు. మరికొందరు "కంపెనీ విజయం ఉద్యోగుల కష్టంతోనే సాధ్యం, అందుకే వారికి సరైన విశ్రాంతి కూడా అవసరం" అన్నారు. కానీ కొంతమంది మాత్రం "పెద్ద కంపెనీల్లో టాప్ మేనేజ్మెంట్‌కి ఎక్కువ కష్టపడాల్సిందే" అని సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యకు మద్దతు ఇచ్చారు.


Click it and Unblock the Notifications