Women: గతంతో పోలిస్తే వ్యాపార లావాదేవీలలో మహిళల పాత్ర ఎంతో కీలకంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు గానూ మహిళలు చక్రం తిప్పడం తెలిసిందే. మన దేశంలోనూ ఇందిరా గాంధీ, ప్రతిభా పాటిల్ వంటి మహిళలు అత్యున్నత స్థానాలను అధిరోహించి ఆ పదవులకు వన్నెతెచ్చారు. ఇటీవల వచ్చిన భారీ మార్పుల కారణంగా.. పెద్ద టెక్ కంపెనీలు దగ్గర నుంచి ఇతర దిగ్గజ సంస్థల వరకు తమ టాప్ లెవల్ పొజిషన్లలో మహిళలకు స్థానం కల్పిస్తున్నాయి. నారీ శక్తిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సైతం పలు పథకాలను ప్రవేశ పెడుతూ వారి అభ్యున్నతికి పాటుపడుతోంది.

బ్రిక్స్, G7లో భారత్ హవా
భారత మిడ్-మార్కెట్ బిజినెస్ లోని సీనియర్ మేనేజ్ మెంట్ లో కనీసం 36 శాతాన్ని మహిళలు నిర్వహిస్తున్నట్లు గ్రాంట్ థోర్న్ టన్ ఇంటర్నేషనల్ బిజినెస్ రిపోర్ట్ వెల్లడించింది.బ్రిక్స్ దేశాలతో పోలిస్తే ఈ భాగస్వామ్యం 34 శాతం, G7 పార్టనర్స్ తో చూస్తే 30 శాతంతో ఇండియా ముందంజలో ఉన్నట్లు పేర్కొంది.
అయితే ఈ సెగ్మెంట్లోని 5 శాతం సీనియర్ లీడర్షిప్ లో మహిళలు లేకపోవడం బాధాకరమని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 32 శాతం మహిళలు సీనియర్ మేనేజ్మెంట్లో ఉన్నట్లు, 9 శాతం వ్యాపారాల్లో వారి భాగస్వామ్యం లేనట్లు స్పష్టం చేసింది.

భాగస్వామ్య వృద్ధికి పాటించాల్సినవి ఇవీ
ఈ తరహా వ్యాపారాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు హైబ్రిడ్, ఫ్లెక్సిబుల్ పని విధానాలను సృష్టించాల్సిన అవసరం ఉందని గ్రాంట్ థోర్న్ టన్ భారత్ పార్ట్నర్ పల్లవి బఖ్రూ అభిప్రాయపడ్డారు. మహిళలను అర్థం చేసుకుని, వారికి అండగా నిలబడే విధంగా వివిధ రకాల కార్యక్రమాలను రూపొందిస్తూ.. అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
కేవలం దీన్ని బాధ్యతగా మాత్రమే చూడకుండా, వాణిజ్యపరమైన ఓ హక్కుగా గుర్తించాలని పిలుపునిచ్చారు. మహిళల ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వివిధ దిగ్గజ సంస్థలు గొప్పగా రాణిస్తున్నాయన్న విషయాన్ని మరోసారి గుర్తు చేశారు.

పని విధానాలు ఇలా..
ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా సహా పలు రీజియన్లలో సీనియర్ మేనేజ్ మెంట్ లో మహిళల పాత్ర మొదటిసారిగా 30 శాతాన్ని అధిగమించింది. అయితే ఆసియాలో ఈ పెరుగుదల ఎక్కువగా 37 నుంచి 40 శాతానికి వృద్ధి చెందినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 36 శాతం మిడ్ మార్కెట్ బిజినెస్ కార్యాలయాల ద్వారా జరుగుతుండగా.. 53 శాతం హైబ్రిడ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. అదే భారత్ లో తీసుకుంటే 62 శాతం హైబ్రిడ్ విధానం, 27 శాతం కార్యాలయాల నుంచి, 5 శాతం పూర్తిగా ఇంటి నుంచి పని చేస్తున్నట్లు తేలింది.


Click it and Unblock the Notifications