Budget News: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి మధ్యంతర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న సమర్పించనున్నారు. ఈ బడ్జెట్‌లో ఏ రంగానికి ప్రత్యేక కేటాయింపులు ఉంటాయోననే అంచనాలు ప్రజల్లో, మార్కెట్లలో ఉత్కంఠను రోజురోజుకూ పెంచేస్తోంది.
రెండు రోజుల్లో ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌లో ప్రసూతి సెలవు ప్రయోజనాలకు ప్రోత్సాహకాలు, యువతులకు నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యత, మహిళా పారిశ్రామికవేత్తలకు పన్ను మినహాయింపులు, ఉద్యోగం చేస్తున్న తల్లులకు పెయిడ్ లీవ్‌లను పెంచాలనే డిమాండ్స్ ప్రధానంగా పెరుగుతున్నాయి. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(కోల్‌కతా చాప్టర్) ఛైర్‌పర్సన్ రాధికా దాల్మియా ఈ చర్యలను ముఖ్యమైనవిగా పరిగణించి, జాతీయ ఆరోగ్య బీమా పథకం భత్యాన్ని పెంచడం, బాలికలకు విద్య ప్రయోజనాలను పెంచడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

సమ్మిళిత భారతదేశాన్ని ప్రోత్సహించడానికి ఆర్థిక చేరిక, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, విద్యకు అందులోనూ ముఖ్యంగా బాలికలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యమని రాధికా దాల్మియా నొక్కి చెప్పారు.అలాగే సన్‌షైన్ కార్పొరేట్ క్రెష్ సహ వ్యవస్థాపకులు సలోని వర్మ 50+ ఉద్యోగులు ఉన్న కంపెనీలకు క్రెష్ సేవలు, ఆరు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను తప్పనిసరి చేసే ప్రసూతి చట్టం 2017 ప్రభావం గురించి ప్రస్థావించారు.
లోవాక్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు, CEO జ్యోతి భండారి.. బడ్జెట్ 2024లో యువతుల నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అలాగే 12వ తరగతి తర్వాత వృత్తిపరమైన కార్యక్రమాలను అందించాలని పిలుపునిచ్చారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు 'మహిళా మిలియనీర్ల' వృద్ధిని ప్రోత్సహిస్తామనే హామీలను నెరవేర్చాలని ఈ సందర్భంగా కోరారు.


Click it and Unblock the Notifications