TCS: దేశంలోని అతిపెద్ద టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఓ సంచలన విషయం తెలిపింది. తమ సంస్థలోని మహిళా సిబ్బందిలో అట్రిషన్ రేటు పురుష ఉద్యోగుల కంటే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం తొలగించడం కారణంగా ఇలా జరిగినట్లు తెలిపింది. ఈ మేరకు TCS చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ స్పందించారు.
"6 లక్షల కంటే ఎక్కువగా ఉన్న మా శ్రామికశక్తిలో 35 శాతానికి పైగా మహిళలు ఉన్నారు. వీరిలో అట్రిషన్ రేటు ఎక్కువగా లేదా పురుషులతో సమానంగా ఉంది" అని లక్కడ్ తెలిపారు. కొవిడ్ మహమ్మారి సమయంలో అందించిన వర్క్ ఫ్రమ్ హోమ్ ఏర్పాట్లు రీసెట్ చేయడం వల్ల కొంతమంది మహిళలు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థాయికి వచ్చినా కార్యాలయాలకు తిరిగి రావడానికి ఇష్టపడటం లేదని కంపెనీ ప్రచురించిన ఓ వార్షిక నివేదిక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

లింగ వైవిధ్యాన్ని ప్రోత్సహించేందుకు TCS చేస్తున్న ప్రయత్నాలకు ఈ పరిణామం ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఈ ధోరణిని తిప్పికొట్టడానికి కంపెనీ చురుకుగా పనిచేస్తోందని లక్కడ్ తెలిపారు. అయితే వార్షిక నివేదికలో లింగం ఆధారంగా జరిగిన ఖచ్చితమైన అట్రిషన్ సంఖ్య వెల్లడించబడలేదు. కానీ గత ఆర్థిక సంవత్సరం మధ్య నాటికి మొత్తం అట్రిషన్ గరిష్ఠ స్థాయికి చేరుకోగా.. మార్చి చివరి నాటికి 20 శాతానికి పైగా తగ్గింది.
ఈ సమస్యను పరిష్కరించడానికి 'iExcel' వంటి కేంద్రీకృత నాయకత్వ అభివృద్ధి కార్యక్రమాలను TCS అమలు చేసింది. మహిళల కోసం రూపొందించిన ఈ ఫ్లాగ్‌షిప్ ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఇప్పటికే 22 ఎడిషన్‌లను పూర్తి చేసింది. 1,450 మంది మహిళా నాయకులు దీని ద్వారా ప్రయోజనం పొందినట్లు వార్షిక నివేదిక హైలైట్ చేసింది. FY23లో పూర్తి చేసిన అంతర్గత నాయకత్వ స్థానాల్లో దాదాపు నాలుగింట ఒక వంతు మహిళలు ఉండటంతో.. లీడర్‌షిప్ పూల్‌లో మహిళా అభ్యర్థుల నాణ్యతను లక్కడ్ ప్రశంసించారు.


Click it and Unblock the Notifications