Chicken And Eggs: నాజ్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న చికెన్, గుడ్ల ధరలు..!
నాన్ వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్. త్వరలో చికెన్, గుడ్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఫౌల్ట్రీ ఫీడ్ ధరలు భారీగా పెరగడంతో చికెన్, ఎగ్స్ ధరలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 2026 నాటికి చికెన్, గుడ్ల ధరలు 25 శాతం నుంచి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పౌల్ట్రీ ఫీడ్ తయారు చేయడం కోసం మక్కాలు, నూకలు ఎక్కువగా వాడతారు. ఇప్పుడు మక్కలు, నూకల ధరలు భారీగా పెరిగాయి. దీంతో పౌల్ట్రీ ఫీడ్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో చికెన్, ఎగ్స్ ధరలు పెరగనున్నాయి. గత ఏడాది కాలంలో మొక్కజొన్న ధరలు రెట్టింపు అయ్యాయి. వ్యాపారులు, రైతులు మొక్కజొన్నను నిల్వచేస్తుండటంతో ఈ ధరల పెరుగుదల కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
బ్రాయిలర్ కోళ్ల దాణాలో దాదాపు 55-65% వాటా మొక్కజొన్న ఉంటుంది. ఈ మొక్కజొన్న ధర ఏడాది క్రితం కిలోకు రూ. 18 ఉండగా, ప్రస్తుతం సుమారు రూ. 34కి చేరుకుంది. కేవలం నెల రోజుల క్రితం కిలోకు రూ. 26-27గా ఉన్న ఈ ధర, డిసెంబర్ నాటికి రూ. 40కి పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే, నూకల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. గత నెలలో కిలోకు రూ. 22-23గా ఉన్న ధర, ప్రస్తుతం రూ. 31-32కి చేరింది. మొత్తంగా చూస్తే గత ఏడాది కాలంలో కోళ్ల దాణా పదార్థాల ధరలు సుమారు 30-45% పెరగడంతో, రైతుల లాభాల మార్జిన్లపై తీవ్ర ఒత్తిడి పడుతోంది.

ఋతుపవనాల బలహీనత కారణంగా మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రధాన మొక్కజొన్న ఉత్పత్తి రాష్ట్రాల్లో పంట దిగుబడి తగ్గింది. భారత్‌లో ఖరీఫ్ సీజన్ మొక్కజొన్న ఉత్పత్తి 15-16% మేర తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల సరఫరా మరింత తగ్గి ధరలు పెరిగే పరిస్థితి ఏర్పడిందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇథనాల్ పరిశ్రమ నుంచి పెరుగుతున్న డిమాండ్ కూడా ధరలపై ప్రభావం చూపుతోంది. ఎక్కువ మొత్తంలో మొక్కజొన్నను ఇథనాల్ ఉత్పత్తికి మళ్లిస్తున్నారు. అదే సమయంలో ఖరీఫ్ వరి దిగుబడులు తక్కువగా ఉండవచ్చనే అంచనాల వల్ల బియ్యం ధరలు కూడా పెరిగాయి.
కోళ్ల పెంపకందారులు ఇతర ధాన్యాలను ప్రత్యామ్నాయంగా వాడదామన్నా అవి కూడా ఖరీదుగా మారాయి. జొన్నలు, సజ్జలు, రాగులు వంటి ధాన్యాల ధరలు కూడా పెరగడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. దాణా ధరల పెరుగుదల ప్రభావం రాబోయే వారాల్లో రిటైల్ ధరలపై కనిపించనుంది. డిసెంబర్ నాటికి గుడ్ల హోల్‌సేల్ ధరలు ప్రస్తుతం ఉన్న రూ. 6-7 నుంచి రూ. 7-8కి పెరగవచ్చని పరిశ్రమ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. చికెన్ హోల్‌సేల్ ధరలు కూడా కిలోకు రూ. 225-250 నుంచి రూ. 260-275కి పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా చలికాలంలో గుడ్లు, చికెన్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు దాణా ధరలు పెరగడంతో చికెన్, గుడ్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications