Gold In China: బంగారం కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్న చైనా ప్రజలు..
బంగారం భారీగా పెరగడానికి చైనా కూడా ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఆ దేశ సెంట్రల్ బ్యాంకు భారీగా బంగారం కొనుగోలు చేస్తోంది. అంతే కాదు అక్కడి ప్రజలు గోల్డ్ ఈటీఎఫ్ ల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అంతే కాదు పసిడిని కొనుగోలు చేసేందుకు కూడా ఎగబడుతున్నారు. ప్రస్తుతం చైనాలో పుత్తడి కొనుగోళ్లు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు పడిపోవడంతో.. చైనాలోని షెంజెన్ గోల్డ్ మార్కెట్‌కి కొనుగోలుదారుల భారీగా తరలొచ్చారు. ధరల తగ్గుదలని సద్వినియోగం చేసుకోవడానికి బార్గెయిన్ హంటర్స్ ఎగబడటంతో షాపింగ్ కారిడార్లు అన్నీ నిండిపోయాయి. కనీసం కదలడానికి కూడా వీలు లేనంత ఇసుక వేస్తే రాలనంత జనం గుమికూడటంతో వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పడిపోవడమే ఈ కొనుగోళ్ల కారణంగా అక్కడి వారు చెబుతున్నారు. సుదీర్ఘకాలంగా విపరీతంగా పెరిగిన బంగారం రేట్లు, తాజాగా సైకలాజికల్ మార్కైన 4వేల డాలర్ల దిగువకు తగ్గాయి. అక్టోబర్ 23న స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 3,995.63 డాలర్లకు చేరింది. జూన్ తర్వాత పసిడి ఈ స్థాయిలో వారపు క్షీణతను నమోదు చేయడం ఇదే మొదటిసారి కావడంతో భారీగా కొనుగోళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంతర్జాతీయ ధరల తగ్గుదల ప్రభావం చైనా జ్యువెలరీ మార్కెట్లపై పడుతోంది. లామియో గోల్డ్, చౌ సాంగ్ సాంగ్, చౌ తాఈ ఫూక్ వంటి ప్రముఖ బ్రాండ్లు తమ ఆభరణాల ధరలను గ్రాముకు 6 నుంచి 12 యువాన్ల వరకు తగ్గించాయి.

దీంతో కొనుగోలుదారులు పసిడి కొనుగోలుకు ఎగబడుతున్నారు. అంతకుముందు నెలతో పోలిస్తే రిటైల్ గోల్డ్ జ్యువెలరీ ధరలు ఏకంగా 100 యువాన్ల వరకు తగ్గడంతో ఎప్పటికప్పుడు కొనుగోలు కోసం ఎదురుచూస్తున్న సామాన్యులు, పెళ్లిళ్ల కోసం షాపింగ్ చేసేవారు ఇప్పుడు మార్కెట్‌కు క్యూ కట్టారు. చైనాలోని రుహూ జిల్లాలో ఉన్న షెంజెన్ 'షుయిబీ' మార్కెట్ ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ ట్రేడింగ్ సెంటర్లలో ఒకటిగా ఉంది. హోల్‌సేల్, రిటైల్, తయారీదారులు అందరూ ఒకే చోట దొరికే ఈ మార్కెట్‌కు ఎప్పుడూ రద్దీగానే కనిపిస్తోంది. ఇటీవల చైనా నేషనల్ డే సెలవుల సమయంలోనూ రోజుకు దాదాపు 60 వేల మంది సందర్శకులు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ధరలు తగ్గడంతో రద్దీ మరింత విపరీతంగా పెరిగినట్లు అక్కడి వార్త సంస్థలు పేర్కొంటున్నాయి.
అక్కడ కూరగాయల మార్కెట్లో కంటే ఎక్కువ జనం బంగారం కొనుగోలు చేయడానికి వచ్చారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చైనా ప్రజలు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు.. అది ఒక సాంప్రదాయ సంపదగా భావిస్తారు. ధరలు విపరీతంగా పెరిగినప్పుడు కొనుగోళ్లు వాయిదా వేసుకున్న జనం.. ఇప్పుడు రేట్లు తగ్గగానే మార్కెట్‌కు తిరిగి వస్తున్నట్లు తెలుస్తోంది. మిడిల్ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం భయాల కారణంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఇప్పట్లో తగ్గించకపోవచ్చనే అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications