Wipro Q4 Results: విప్రో అదుర్స్, ఆ మార్జిన్‌పై శాలరీ పెంపు ప్రభావం
దేశీయ ఐటీ దిగ్గజం విప్రో 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగో త్రైమాసిక ఫలితాలను గురువారం (ఏప్రిల్ 15) ప్రకటించింది. కరోనా క్లిష్టపరిస్థితుల్లోను గత దశాబ్దకాలంలో ఓ త్రైమాసికంలో మంచి ఫలితాలు నమోదు చేయడం నాలుగోసారి. FY21 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి విప్రో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.2,972 కోట్లకు చేరుకుంది.
అంతకుముందు ఏడాది ఇదే కాలానికి నమోదైన రూ.2,326.1 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 27.7 శాతం అధికం. Q4లో సంస్థ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 3.4 శాతం పెరిగి రూ.16,2454 కోట్లుగా నమోదయింది. ఏడాది క్రితం ఇదే సమయంలో రూ.15,711 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

ఆదాయ వృద్ధి
రాబోయే క్వార్టర్‌లోను ఆదాయంలో బలమైన వృద్ధి కొనసాగుతుందని విప్రో ఆశాభావం వ్యక్తం చేసింది. కంపెనీకి ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఐటీ సేవల విభాగం జనవరి-మార్చిలో 2,152.40 మిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసింది. క్వార్టర్ ప్రాతిపదికన ఈ విభాగం ఆదాయం 3.9 శాతం మేర పెరిగింది. ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఐటీ సేవల విభాగ ఆదాయం 2,195-2,238 మిలియన్ డాలర్ల శ్రేణిలో ఉండొచ్చని, జనవరి-మార్చితో పోలిస్తే 2 శాతం నుండి 4 శాతం పెరగవచ్చునని కంపెనీ అంచనా.

కాంట్రాక్ట్ వ్యాల్యూ.. ఇదే తొలిసారి
గత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ సంవత్సరంలో మొత్తం కాంట్రాక్ట్ వ్యాల్యూ వార్షిక ప్రాతిపదికన 33 శాతం పెరిగింది. విప్రో చరిత్రలో ఇది అత్యధికం. మొత్తం 12 పెద్ద కాంట్రాక్టులు దక్కించుకుంది. మొత్తం కాంట్రాక్ట్ వ్యాల్యూ 1.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 100 మిలియన్ డాలర్ల కేటగిరీలో ఒకటి, 75 మిలియన్ డాలర్ల విభాగంలో మూడు, 50 మిలియన్ డాలర్ల విభాగంలో మూడు కాంట్రాక్ట్స్ దక్కాయి. మార్చి 31తో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 11 శాతం పెరిగి రూ.10,796.40 కోట్లకు, ఆదాయం 1.5 శాతం వృద్ధి సాధించి రూ.61,943 కోట్లకు చేరుకుంది.

వేతనాల పంపు
నిర్వహణ మార్జిన్లపై వేతనాల పెంపు ప్రభావం ఉందని విప్రో తెలిపింది. ఏడాది క్రితంతో పోలిస్తే 340 బేసిస్ పాయింట్ల మేర నిర్వహణ మార్జిన్ పెరిగినట్లు తెలిపింది. 2021 జనవరి 1 నుంచి వర్తించేలా 80 శాతం మంది ఉద్యోగులకు వేతన పెంపు, పదోన్నతులు ప్రకటించింది. మిగతా ఉన్నత ఉద్యోగులకు జూన్ నుండి వేతన పెంపు అమలు చేస్తోంది. 2021 మార్చి చివరి నాటికి కంపెనీలో పని చేస్తోన్న ఉద్యోగుల సంఖ్య 1,97,712కు చేరుకుంది. వలసల రేటు 12.1 శాతంగా ఉంది.


Click it and Unblock the Notifications