Wipro: విదేశీ కంపెనీతో జతకడుతున్న విప్రో.. భవిష్యత్తు వ్యాపారంపై ఫోకస్..
Wipro: వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో పట్టణీకరణ కూడా అంతే వేగంగా జరుగుతోంది. దీనికి తగినట్లుగానే ఎయిర్ పొల్యూషన్ సైతం పెరుగుతోంది. అయితే చాలా కారణాల వల్ల తగ్గుతున్న గాలి నాణ్యత మనుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ.. ఆయుర్థాయాన్ని తగ్గిస్తోంది. ఈ క్రమంలో ఎయిర్ క్వాలిటీకి సంబంధించిన పరికరాల వ్యాపారం ఊపందుకుంటోంది.

విప్రో జోడీ..
గాలి నాణ్యత సమస్యలకు పరిష్కారాలను అందించేందుకు విప్రో లైటింగ్ ఇటలీకి చెందిన ఆరా ఎయిర్ కంపెనీతో జత కడుతోంది. ఈ ఒప్పందం దేశవ్యాప్తంగా కంపెనీ వ్యాపార విస్తరణకు ఎంతగానో ఉపయోగపడనుంది. దీని ఫలితంగా కంపెనీ తన వ్యాపార పోర్ట్‌ఫోలియోకు ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ వ్యాపారాన్ని జోడిస్తోంది. ఈ కారణంగా ఇకపై రెండు కంపెనీలు సంయుక్తంగా దేశీయ మార్కెట్లో తమ సేవలను అందించనున్నాయి.

మెుబైల్ యాప్..
మొబైల్ యాప్ ద్వారా గాలి నాణ్యతను గ్లోబల్ స్టాండర్డ్స్‌లో పర్యవేక్షించే సర్వీస్‌ను ప్రారంభించనున్నట్లు విప్రో వెల్లడించింది. ఈ వ్యాపారాన్ని బహుళ రంగాల్లోకి విస్తరించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు లైటింగ్, సీటింగ్ సేవల్లో ఉన్న విప్రో.. ఆరా ఎయిర్ తో జతకట్టి మరిన్ని సేవలను అందించటానికి సిద్ధమౌతోంది.

అధిక డిమాండ్..
ఈ రోజుల్లో మెరుగైన ఇండోర్ గాలి అవసరాలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. నగరాల విస్తరణతో పాటు ఎత్తైన భవనాలు పెరగటంతో స్వచ్ఛమైన గాలికోసం పరిష్కారాలు అవసరం అవుతున్నాయి. దీనికి తోడు ప్రజలు ఎక్కువ సమయం ఆఫీసుల్లో గడపాల్సి రావటంతో అందుకు అవసరమైన పరిష్కారాలకు ప్రాథమిక అవసరాల్లో ఒకటిగా ఉంది. ఇది కంపెనీ వ్యాపారానికి, వేగంగా విస్తరించటానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఆరా ఏమందంటే..
భారతదేశంలోని కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా విప్రో లైటింగ్ సహకారంతో స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవటానికి అవసరమైన ఉత్పత్తులను తీసుకొస్తామని ఆరా వెల్లడించింది.


Click it and Unblock the Notifications