IT News: భారీగా క్షీణించిన విప్రో మార్జిన్స్.. వందలాది మందికి లేఆఫ్స్
Wipro News: దేశీయ టెక్ ఇండస్ట్రీలో మరోసారి కలవరం మొదలైంది. విదేశాల్లోని క్లయింట్స్ ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుండటం మన కంపెనీల వృద్ధికి విఘాతంగా మారింది. దీంతో మార్జిన్స్ పెంచుకునేందుకు ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించక తప్పని పరిస్థితి ఏర్పడింది. తాజాగ ప్రముఖ దిగ్గజ ప్లేయర్ విప్రో సిబ్బందికి ఉద్వాసన పలికే దిశగా అడుగులు వేస్తోంది.
దాదాపు 245 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ IT పరిశ్రమలో తొలగింపుల సీజన్ ప్రారంభమైనట్లు మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. IT మేజర్ విప్రో వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మార్జిన్‌లను మెరుగుపరుచుకోవాలని చూస్తున్నందున ఆన్‌సైట్‌లో పనిచేస్తున్న మిడ్-లెవల్ సిబ్బందిపై ఈ నిర్ణయం ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు సమాచారం.

విశ్లేషణల ప్రకారం విప్రో ఆఫ్‌షోర్ మరియు ఆన్‌సైట్ నిష్పత్తి దాదాపు 80:20గా ఉంది. ఆదాయం విషయానికి వస్తే విభజన 55:45గా చెప్పుకోవచ్చు. స్థానిక ఉద్యోగులతో పోలిస్తే ఆన్‌సైట్ సిబ్బంది జీతం ఖర్చులు గణనీయంగా ఎక్కువగా ఉంటాయి. తద్వారా వారిని తొలగించి ఖర్చులు మిగుల్చుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
మారుతున్న మార్కెట్ వాతావరణానికి అనుగుణంగా తమ వ్యాపారాన్ని మరియు ప్రతిభను సమం చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దేశంలోని నాలుగు అతిపెద్ద IT సంస్థల్లో విప్రో అతి తక్కువ మార్జిన్‌ను కలిగి ఉంది. డిసెంబర్ త్రైమాసికంలో కేవలం ఇది 16 శాతంగా నమోదైంది. TCS, ఇన్ఫోసిస్ మరియు HCLTech కంటే తక్కువగా ఉంది.
గతేడాదిగా డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో IT కంపెనీలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే ఖర్చులను మేనేజ్ చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. పలు ఉద్యోగాలను AI భర్తీ చేసే ప్రమాదం కూడా ఉంది. FY24 మొదటి 9 నెలల్లో భారతదేశంలోని టాప్ 4 కంపెనీలు దాదాపు 50 వేల 875 మంది సిబ్బందిని తొలగించాయి. వార్షిక ప్రాతిపదికన విప్రో హెడ్‌కౌంట్ స్థిరంగా క్షీణిస్తూ వస్తోంది. గత 3 నెలలతో పోలిస్తే Q3లో 4 వేల 473 మంది, ఏడాది ప్రాతిపదికన డిసెంబర్ త్రైమాసికంలో 21 వేల 875 మంది తగ్గారు.


Click it and Unblock the Notifications