Wipro News: దేశవ్యాప్తంగా ఉద్యోగాల కొరత తీవ్ర స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. సింహభాగం విద్యార్థులు IT రంగంపై ఆసక్తి కనబరుస్తూ అవే కోర్సులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదే సమయంలో పాశ్చాత్య దేశాలు ఖర్చులను తగ్గించుకుంటూ ఇండియా పోటీదారులకు ప్రాజెక్టులను అప్పగిస్తున్నాయి. దీనికి తోడు దిగ్గజ అంతర్జాతీయ కంపెనీలు కొత్త టెక్నాలజీలలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న సిబ్బందికి లేఆఫ్స్ ఇస్తున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో దేశీయ టెక్ కంపెనీలు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.
వీటన్నిటి దృష్ట్యా ఇటీవల విప్రో, ఇన్ఫోసిస్ వంటి భారతీయ సంస్థలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఫ్రెషర్స్ ఆన్ బోర్డింగ్ విషయంలో వాటి తీరు సరిగా లేదంటూ పలువురు అసహనం వ్యక్తం చేశారు. నిర్ణయించిన సమయానికి ప్రెషర్లను ఆన్ బోర్డ్ చేయకుండా ఎప్పటికప్పుడు తేదీని పొడిగిస్తూ రావడం పట్ల ఆందోళన చెలరేగింది. దీనిపై IT కంపెనీల ఉద్యోగుల సంఘం కార్మిక శాఖకు కూడా ఫిర్యాదు చేసింది. ఇంత జరిగినా ఆఫర్ లెటర్లు అందుకొని ఆన్ బోర్డింగ్ కోసం దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్న ఫ్రెషర్లకు ఇప్పుడు గట్టి షాక్ తగిలింది.

ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన దాదాపు 30 నెలల తర్వాత విప్రో ఇప్పుడు వాటిని రద్దు చేసింది. తప్పనిసరి ప్రీ స్కిల్ శిక్షణ పూర్తి చేయలేకపోయారంటూ.. ఇంతకాలం పొడిగించుకుంటూ వచ్చిన జాబ్ ఆఫర్లకు మంగళం పాడింది. అర్హత ప్రమాణాలు చేరుకోవడంలో విఫలమయ్యారని కుంటి సాకులు చెప్పుకొచ్చింది. ఈ వ్యవహారంపై ప్రముఖ ప్రొఫెషనల్ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లింక్డ్ ఇన్‌లో పలువురు ఫ్రెషర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండున్నర ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ, పది రోజుల కఠోర శిక్షణానంతరం ఇలా చేయడం సరికాదని ఆవేదన చెందుతున్నారు.
విప్రో మాత్రం 'మా రొటీన్ ఆన్ బోర్డింగ్ ప్రక్రియలో భాగంగా నైపుణ్యాలను సమగ్రంగా పరిశీలిస్తాము. తద్వారా మా నెక్స్ట్-జెన్ అసోసియేట్లు సరైన ప్రాజెక్టులకు కేటాయించబడేట్లుగా ప్లాన్ చేస్తాము. అత్యంత లేటెస్ట్ టెక్నాలజీలో వారికి ప్రావీణ్యం ఉండేలా చూసుకుంటాము. క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా ప్రతి ఎంట్రీ లెవల్ ఉద్యోగి సరైన నైపుణ్యా లను ప్రదర్శించాలని ఆశిస్తాము. ఈ పెరామీటర్లలో ఫెయిల్ అయిన వారికి భంగపాటు తప్పదు' అని స్టేట్‌మెంట్ ఇచ్చి చేతులు దులుపుకుంది.


Click it and Unblock the Notifications