కరోనా మహమ్మారి కారణంగా మొన్నటిదాకా డీలా పడిన రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. అయితే పెరుగుతున్న ఇళ్ళ ధరలు మాత్రం సామాన్యుల సొంతింటి కల దూరం చేస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని భావిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి రియల్టర్లు ఇళ్ళ అమ్మకాలు జరపాలంటే ఖచ్చితంగా ధరలను పెంచి తీరాల్సిందే. అందుకు కారణాలు లేకపోలేదు.
ప్రస్తుతం సిమెంట్, స్టీల్ ధరలు అనూహ్యంగా పెరగడం, శానిటరీ, ఎలక్ట్రికల్ విడిభాగాల ధరలు కూడా విపరీతంగా పెరగటం, నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు చాలా మంది సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవడంతో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం నిర్మాణ రంగ సంస్థలకు తలకుమించిన భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది.

నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ ఇండియా తాజా అధ్యయనం ప్రకారం ప్రస్తుతం ఇండిపెండెంట్ ఇల్లు కానీ, అపార్ట్మెంట్లో ఫ్లాట్ గాని కొనుగోలు చేయాలంటే 10 నుండి 15 శాతం ధరలను పెంచి అమ్మాల్సిన పరిస్థితి ఉందని పేర్కొంది.
నిర్మాణ రంగానికి సంబంధించిన పరిశ్రమల్లో ఉత్పత్తి తగ్గటం, పరిశ్రమలపై అదనపు భారం పడడంతో, అన్ని పరిశ్రమలు ధరలను పెంచాయి. ఇక రియల్టర్లు తాము కొనుగోలు చేసే నిర్మాణ సామాగ్రి పై పెరిగిన ధరలను తాము భరించే పరిస్థితిలో లేరు. దీంతో వారు కొనుగోలుదారుల పైనే ఆ భారాన్ని మోపనున్నారు. దీంతో సగటు మధ్యతరగతి వేతన జీవులకు సొంతింటి కల నెరవేరాలంటే, అది భారంగా పరిణమించింది. కరోనా సమయంలో ధరలు తగ్గుతాయని అనుకుంటే అందుకు భిన్నంగా అన్ని ధరలు పెరగడం రియల్టర్ లకు మాత్రమే కాదు, సామాన్య ప్రజలకు అశనిపాతంగా మారింది.


Click it and Unblock the Notifications