ఏపీలోని చిత్తూరు జిల్లా రేణిగుంటకు రూ.15,000 కోట్ల పెట్టుబడితో రావాల్సిన రిలయన్స్ పరిశ్రమ వెనక్కి వెళ్లే పరిస్థితులు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి. రిలయన్స్‌కు గత ప్రభుత్వం భూములు కేటాయించింది. అయితే ఈ భూములను వెనక్కి తీసుకొని ఇళ్ల స్థలాలుగా మార్చాలని నిర్ణయించుకుందట. అయితే ప్రభుత్వం మాత్రం రిలయన్స్ సంస్థ ఎక్కడకూ వెళ్లదని చెబుతోంది.

భూములు వెనక్కి తీసుకుంటారా?
రిలయన్స్ సంస్థకు కేటాయించిన భూమిని వెనక్కి తీసుకునేందుకు తహసీల్దారు.. కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించారట. తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలోని పేదలకు ఇళ్ళ స్థలాల కింద ఈ భూములను కేటాయించాలని ప్రతిపాదించారని చెబుతున్నారు. దీనికి కలెక్టర్ ఆమోదముద్ర వేస్తే ఈ భూమిని ఏపీఐఐసీ ద్వారా వెనక్కి తీసుకుంటారు.

10 లక్షల ఉత్పత్తి సామర్థ్యంతో..
రిలయన్స్‌కు 60.26 ఎకరాల భూమిని గత ప్రభుత్వం కేటాయించింది. 10 లక్షల ఉత్పత్తి సామర్థ్యంతో సెల్‌ఫోన్లు, టీవీలు, చిప్ డిజైన్లు, బ్యాటరీలు, సెట్‌టాప్ బాక్సుల తయారీ ప్లాంట్ నెలకొల్పేందుకు రిలయన్స్ మొగ్గు చూపగా టీడీపీ ప్రభుత్వం రేణిగుంట సమీపంలో భూమిని కేటాయించారు. 2018 ఫిబ్రవరిలో ముఖేష్ అంబానీ.. చంద్రబాబును కలిశారు.

ఇక్కడ భూమి కేటాయింపు
కుర్రకాల్వ రెవెన్యూ గ్రామ పరిధిలో 60 ఎకరాలకు పైగా, వికృతమాల పరిధిలో 76 ఎకరాలకు పైగా కేటాయించారు. రిలయన్స్ సంస్థ తొలి విడతగా ఏపీఐఐసీకి రూ.4 కోట్లు చెల్లించినట్లుగా చెబుతున్నారు. అయితే పరిహారం విషయంలో రైతులు కోర్టుకు వెళ్లడంతో విచారణలో ఉంది.

పేదలకు ఇళ్ళ కోసం..
తెలుగు సంవత్సరాది ఉగాది నాటికి పేదలకు ఇళ్లు లేదా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కుర్రకాల్వలో ఏపీఐఐసీ ద్వారా రిలయన్స్‌కు కేటాయించిన 60 ఎకరాలను తీసుకోవాలని భావిస్తున్నారని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications