Gold rates: బంగారం ధరలు భారీగా తగ్గనున్నాయా? లక్ష రూపాయలకు పడిపోతాయా?
గత ఏడాది కాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు ఇప్పుడు కాస్త వెనక్కి తగ్గుతున్నాయి. చారిత్రాత్మక గరిష్టాలను తాకిన పసిడి ధరలు, ఇప్పుడు మదుపర్లను ఆశ్చర్యపరిచేలా కిందికి దిగివస్తున్నాయి. 2026 ప్రారంభంలో మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్ (MCX) లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 1,80,779 వద్ద రికార్డు సృష్టించింది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాలు, ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడి వల్ల బంగారం (Gold) మార్కెట్ చల్లబడుతోంది.

భారీగా పడిపోయిన ధర.. కారణం ఏంటి?
కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే బంగారం ధరలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. గత శుక్రవారం ఒక్కరోజే పసిడి ధర సుమారు రూ. 24,500 తగ్గి.. రూ. 1,56,200 స్థాయికి పడిపోయింది. ఫిబ్రవరి 16 నాటికి ఇది మరింత తగ్గి రూ. 1,54,937 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ హఠాత్తు మార్పుకు ప్రధాన కారణం రష్యా ఆర్థిక విధానాల్లో వస్తున్న మార్పులని నిపుణులు చెబుతున్నారు. రష్యా మళ్లీ అమెరికన్ డాలర్లలో వాణిజ్యం చేసే దిశగా అడుగులు వేస్తోందన్న వార్తలు మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీశాయి.
రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు, మార్కెట్ ప్రభావం
సాధారణంగా యుద్ధం లేదా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారం వైపు మొగ్గు చూపుతారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇదే జరిగింది. కానీ, ఇప్పుడు శాంతి చర్చల సంకేతాలు రావడం, డాలర్ ప్రాధాన్యత మళ్లీ పెరగవచ్చనే ఊహాగానాల వల్ల బంగారానికి ఉన్న డిమాండ్ తగ్గుతోంది. బ్రిక్స్ (BRICS) దేశాలు తమ బంగారం నిల్వలను పెంచుకోవడం ద్వారా డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించాలని చూసినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితులు మళ్లీ డాలర్ బాండ్ల వైపు ఇన్వెస్టర్లను నడిపిస్తున్నాయి.
మధ్యతరగతి ప్రజలకు ఊరట లభిస్తుందా?
సెబీ (SEBI) గుర్తింపు పొందిన విశ్లేషకులు అనుజ్ గుప్తా, అమిత్ గోయల్ అభిప్రాయం ప్రకారం.. రాబోయే నెలల్లో బంగారం ధరలు రూ. 90,000 నుంచి రూ. 1,00,000 మధ్య స్థిరపడే అవకాశం ఉంది. ఇది సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరట అని చెప్పవచ్చు. ముందుగా డిజిటల్ గోల్డ్ లేదా పేపర్ గోల్డ్ మార్కెట్లో అమ్మకాలు జరుగుతాయని, ఆ తర్వాత ఫిజికల్ గోల్డ్ (నగలు, బిస్కెట్లు) ధరల్లో క్రమంగా మార్పు వస్తుందని వారు అంచనా వేస్తున్నారు.
నిపుణుల సూచన: ఇప్పుడే కొనవచ్చా?
మార్కెట్ ప్రస్తుతం చాలా అస్థిరంగా ఉంది. కాబట్టి కొనుగోలుదారులు తొందరపడి ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నందున మార్కెట్ కదలికలను గమనిస్తూ స్థిరత్వం వచ్చాక కొనుగోలు చేయడం ఉత్తమం. అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు బంగారం ధరను శాసించనున్నాయి.
మొత్తంగా చెప్పాలంటే, బంగారం ధరలు లక్ష రూపాయల దిగువకు వస్తాయా లేదా అనేది మరికొన్ని రోజులు వేచి చూడాలి. కానీ, ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే పసిడి జోరుకు బ్రేకులు పడినట్లే కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications