ఇరాన్ 10-సూత్రాల కాల్పుల విరమణ షరతులు ఇవే.. శాంతి చర్చల్లో ట్రంప్ వీటిని అంగీకరిస్తారా.. యుద్ధం ఆగినట్లేనా..
అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ..ట్రంప్ రెండు వారాల పాటు కాల్పుల విరమణ ప్రకటించారు. దీంతో ప్రపంచం మొత్తం కాస్త ఊపిరి పీల్చుకుంది. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో అమెరికా అధ్యక్షుడు తాత్కాలికంగా రెండు వారాల పాటు వార్ నిలిపివేస్తున్నామని, శాంతి చర్చలు జరుపుతామని ప్రకటించారు. ఇరాన్ కూడా ఈ తాత్కాలిక ఒప్పందానికి అంగీకరించిందని, 10-సూత్రాల ఫార్ములాని టేబుల్ ముందు ఉంచిందని ట్రంప్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రతిపాదించిన 10-సూత్రాల ఫార్ములా ఏంటి అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కాగా అమెరికాతో యుద్ధాన్ని ముగించడానికి, శాశ్వత శాంతిని నెలకొల్పడానికి రూపొందించిన ఒక ముసాయిదానే ఈ 10 సూత్రాల ఫార్ములా. ప్రస్తుతానికి ఈ పది సూత్రాలపై చర్చలు జరపడానికి రెండు వారాల కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి.

ఏప్రిల్ 10 నుండి ఇస్లామాబాద్‌లో జరిగే చర్చల్లో ఈ అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.ఈ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కాలిఫోర్నియాలో "వర్కబుల్ బేసిస్" అనే పదంతో ప్రధానంగా చర్చలకు ఒక ఆధారం అని చెప్పారు.
వివిధ అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఆ 10 కీలక సూత్రాలు ఇక్కడ ఉన్నాయి:
1. యుద్ధం శాశ్వత నిలిపివేత: ఇరాన్, ఇరాక్, లెబనాన్, యెమెన్ వంటి అన్ని దేశాలపై తక్షణమే, శాశ్వతంగా దాడులను నిలిపివేయాలి.
2. హార్ముజ్ జలసంధి పునఃప్రారంభం: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని తక్షణమే వాణిజ్య నౌకల కోసం తెరవడం. ఇరాన్ సైన్యం నియంత్రణలో అది ఉండాలనే షరతు..
3. నౌకల రక్షణ ప్రోటోకాల్: జలసంధి గుండా వెళ్లే నౌకల భద్రత, స్వేచ్ఛా రవాణా కోసం ఇరాన్ సైనిక పర్యవేక్షణలో ఒక కొత్త ప్రోటోకాల్‌ను ఏర్పాటు చేయాలి.
4. ట్రాన్సిట్ ఫీజు (రవాణా రుసుము): జలసంధి గుండా వెళ్లే ప్రతి నౌకపై సుమారు $2 మిలియన్ల రుసుమును విధించాలి. ఈ ఆదాయాన్ని ఒమన్‌తో పంచుకోవడమే కాకుండా, యుద్ధంలో దెబ్బతిన్న ఇరాన్ మౌలిక సదుపాయాల పునర్నిర్మాణానికి ఉపయోగించాలి.
5. యూరేనియం సుసంపన్నత గుర్తింపు: ఇరాన్ తన పౌర అవసరాల కోసం జరుపుతున్న యూరేనియం సుసంపన్నత హక్కును అమెరికా, ఇతర దేశాలు గుర్తించాలి.
6. అన్ని ఆంక్షల ఎత్తివేత: ఇరాన్‌పై ఉన్న ప్రాథమిక, ద్వితీయ ఆర్థిక ఆంక్షలన్నింటినీ పూర్తిగా తొలగించాలి.
7. స్తంభింపజేసిన నిధుల విడుదల: అమెరికా, ఇతర దేశాల్లో ఉన్న ఇరాన్ నిధులను, ఆస్తులను తక్షణమే విడుదల చేయాలి.
8. నష్టపరిహారం: యుద్ధం కారణంగా జరిగిన విధ్వంసానికి గాను ఇరాన్‌కు పూర్తి స్థాయిలో పునర్నిర్మాణ ఖర్చులు లేదా నష్టపరిహారం చెల్లించాలి.
9. అమెరికా సైనిక ఉపసంహరణ: మధ్యప్రాచ్యంలోని ప్రాంతీయ స్థావరాల నుండి అమెరికా తన పోరాట దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలి.
10. అంతర్జాతీయ ఒప్పంద భద్రత: ఈ పది సూత్రాలతో కూడిన ఒప్పందాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) ఆమోదించాలి. తద్వారా ఇది అంతర్జాతీయ చట్టం ప్రకారం పక్కాగా అమలు కావాలి.
ఇరాన్ పంపిన 10 సూత్రాల ఫార్ములా సానుకూలంగానే ఉందని Trump ప్రకటించారు. శాంతి చర్చలు జరుపుతామని తెలిపారు. పశ్చిమాసియాలో ప్రశాంతతను నెలకొల్పడానికి ఈ రెండు వారాల గడువు ఉపయోగపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే కొన్ని షరతులు ఆమోదయోగ్యంగా లేవని ట్రంప్ సర్కారు లోపల మధనపడుతున్నట్లుగా తెలుస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications