భారతదేశంలో ప్రతి ఏడాది ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశభక్తితో ఘనంగా జరుపుకుంటారు. ఈసారి దేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల త్యాగాలను స్మరించుకునే రోజు ఈ రోజు. అయితే, దేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నాడియా, మాల్డా జిల్లాల కొన్ని ప్రాంతాలు ఈ దినోత్సవాన్ని రెండు రోజుల తర్వాత అంటే ఆగస్టు 18న జరుపుకోవడం ఒక ప్రత్యేక చారిత్రక సంఘటనగా చెప్పుకోవచ్చు.
1947 ఆగస్టు 15న భారత్ బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందినా, నాడియా, మాల్డా జిల్లాల కొన్ని ప్రాంతాలు ఆ సమయంలో భారతదేశంలో భాగం కాలేదు. విభజన సమయంలో సరిహద్దులు గీసే ప్రక్రియలో ఈ ప్రాంతాలు తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లోకి వెళ్లినట్లు ప్రకటించబడ్డాయి. ఫలితంగా అక్కడి ప్రజలకు ఆగస్టు 15 పండగ దినం కాకుండా నిరాశ, ఆందోళనల రోజు అయింది.

ఈ పరిస్థితి మారడానికి పండిట్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, నాడియా జిల్లా రాజకుటుంబ సభ్యులు, ఇతర ప్రభావశీల నాయకులు బ్రిటిష్ పరిపాలనపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ ప్రాంతాలను భారత్‌లో కలపాలని వారు నిరంతరం డిమాండ్ చేశారు. ఈ సమస్య చివరికి అప్పటి వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్ దృష్టికి వచ్చింది. అనేక చర్చల ఫలితంగా 1947 ఆగస్టు 17 రాత్రి విభజన పటంలో అవసరమైన మార్పులు చేయడం జరిగింది.
దీంతో నాడియా, మాల్డా జిల్లాల కొన్ని ప్రాంతాలు అధికారికంగా భారతదేశంలో విలీనం అయ్యాయి. ఈ విలీనం తర్వాతి రోజున అంటే ఆగస్టు 18 అక్కడి ప్రజలకు నిజమైన స్వాతంత్ర్య దినోత్సవం వచ్చింది. అప్పటి నుండి ఈ రెండు జిల్లాల్లో ప్రతి సంవత్సరం ఆగస్టు 18న జాతీయ పతాకావిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలతో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.
1947 ఆగస్టు 15న, దేశ రాజధాని ఢిల్లీలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి చేసిన ప్రసంగం భారత స్వాతంత్య్రానికి నాంది పలికింది. అయితే, నాడియా , మాల్డా ప్రాంతాల ప్రజలకు ఆ ఉత్సాహం రెండు రోజుల తర్వాత మాత్రమే అందింది. ఈ ఆలస్యమైన స్వాతంత్ర్యం, విభజన సమయంలో సరిహద్దుల గీతలు ఒక ప్రాంత భవిష్యత్తుపై ఎంత ప్రభావం చూపగలవో చూపిస్తుంది.
ఆగస్టు 15 కేవలం చారిత్రక జ్ఞాపకం మాత్రమే కాకుండా, దేశం యొక్క ఐక్యతను ప్రతిబింబించే ప్రత్యేక ఘట్టంగా నిలుస్తోంది. ఇది స్వాతంత్ర్యం అందరికీ సమానంగా అందాలనే సందేశాన్ని ఇస్తుంది. ప్రతి సంవత్సరం ఈ రోజు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు సాంస్కృతిక కార్యక్రమాలు, కవాతులు, దేశభక్తి గీతాలతో నిండిపోతాయి.


Click it and Unblock the Notifications