నిర్మలమ్మ లక్షల కోట్లు ఇచ్చినా మార్కెట్ ఎందుకు కుప్పకూలింది?
ముంబై: రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎంఎస్ఎంఈలు సహా వివిధ రంగాలకు ఇచ్చిన ప్యాకేజీ మార్కెట్లకు రుచించలేదు. సాధారణంగా ప్యాకేజీ తర్వాత మార్కెట్లో ఎంతోకొంత లాభాల్లోకి వస్తాయి. కానీ నిన్న ప్రకటన చేశాక, ఈ రోజు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 500కు పైగా పాయింట్ల నష్టంతో ప్రారంభమై దాదాపు 900 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఫార్మా, ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాలు నష్టపోయాయి. నిర్మల ప్రకటించిన మార్కెట్‌కు ఎందుకు రుచించలేదంటే...

పూర్తి ప్యాకేజీ చూడాలి..
కరోనా-లాక్‌డౌన్ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం రూ.20 లక్షలకోట్ల మెగా ప్యాకేజీని ప్రకటించింది. ఈమొత్తాన్ని విడతలవారీగా ప్రకటిస్తామని ఆర్థికమంత్రి చెప్పారు. రెండు రోజుల క్రితం ప్రధాని మోడీ ప్యాకేజీ ప్రకటన చేయగానే నిన్న మార్కెట్లు పుంజుకున్నాయి. కానీ నిన్న సాయంత్రం నిర్మలమ్మ ఎంఎస్ఎంఈలు, ఎన్బీఎఫ్‌సీ తదితరాలకు ఉద్దీపనలు ప్రకటించారు. అయితే వీటికి కేటాయించిన మొత్తాలను భారీ ఆర్థిక ప్యాకేజీగా చూడలేమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పూర్తి ప్యాకేజీ వివరాలు వచ్చాక మార్కెట్ పరిస్థితులు అర్థమవుతాయని చెబుతున్నారు. భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినప్పటికీ ఖర్చులు కనిపించడం లేదని దీని వల్ల మార్కెట్ నిరాశకు గురైందని చెబుతున్నారు. అదే సమయంలో ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందా అనే మీమాంస ఉంది.

స్వల్పకాలిక ఉపశమనం
నిన్న ప్రకటించిన ప్యాకేజీలో చాలా వరకు క్రెడిట్ రూపంలో ఉన్నాయి. ఎంఎస్ఎంఈలకు, ఇతరులకు ప్రకటించిన ప్యాకేజీ స్వల్పకాలికం కాదని, లాంగ్ టర్మ్‌లో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అంటే ఇప్పటికిప్పుడు ఉపశమనం లేదని, ఇది మార్కెట్ సెంటిమెంటును బలపరచలేకపోయిందని చెబుతున్నారు.

నిధుల వివరాలు
ప్యాకేజీ మొత్తం ప్రకటించే దాకా నిధులకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ఆర్థికమంత్రి నిరాకరించారు. రూ.4.2 లక్షల కోట్ల అదనపు రుణాలు తీసుకోవడం ద్వారా ఈ నిధులలో కొంత భాగం వస్తాయని చెప్పారు. అలాగే, ఎంఎస్ఎంఈలు, ఎన్బీఎఫ్‌సీ తదితరాలకు కలిపి రూ.6 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. ప్రభుత్వ వాస్తవ వ్యయం రూ.1 లక్ష కోట్ల నుండి రూ.1.9 లక్షల కోట్ల వరకు ఉండవచ్చునని అంటున్నారు.

రుణాలు అధికం..
ఇతర ఆర్థిక వ్యవస్థల కంటే భారత రుణాలు జీడీపీతో పోలిస్తే అధిక నిష్పత్తిలో ఉన్నాయి. కరోనా - లాక్ డౌన్ కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు భారీగా పడిపోయి జీడీపీతో రుణాలు పెరిగే అవకాశముంది. గురువారం ప్రకటించిన ప్యాకేజీతో స్థానికంగా నిధులు సమకూర్చినప్పటికీ రుణాలు తీసుకోవడం వల్ల ఖర్చులు అదుపులో ఉంటాయని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications