హార్ముజ్ జలసంధికి చెక్ పెట్టిన సౌదీ అరేబియా.. కొత్త మార్గం ద్వారా ఇండియాకు చమురు సరఫరా..
పశ్చిమ ఆసియాలో రోజురోజుకూ పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో.. అంతర్జాతీయ మార్కెట్లకు ముడి చమురు సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా చూసేందుకు సౌదీ అరేబియా ఒక కొత్త ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంది. ఇరాన్-అమెరికాల మధ్య ఘర్షణ వాతావరణంతో హార్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రం మార్గాలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటుండటంతో.. సౌదీ అరేబియా తన చమురును ఈజిప్ట్ ద్వారా ఆసియా దేశాలకు రవాణా చేస్తోంది.
ఛాయిస్ బ్రోకింగ్ నివేదిక ప్రకారం.. సౌదీ అరేబియా మొదట సుమెడ్ పైప్‌లైన్ (Sumed Pipeline) ద్వారా తన ముడి చమురును ఈజిప్ట్‌లోని సిది కిరిర్ టెర్మినల్‌కు చేరవేస్తోంది. అక్కడి నుండి చమురును పెద్ద ఓడల్లోకి ఎక్కించి.. సూయజ్ కాలువ మార్గంలో ఆసియా దేశాలకు సరఫరా చేస్తోంది. అయితే ఇది తాత్కాలిక ఊరట మాత్రమేనని.. హార్ముజ్ జలసంధికి ఇది పూర్తి ప్రత్యామ్నాయం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

అయితే ఈ ప్రత్యామ్నాయ మార్గం గుండా చమురు చేరవేయడం అంత సులభం కాదు. సాధారణ మార్గం కంటే ఈ విధానంలో ఆసియా దేశాలకు చమురు చేరడానికి 20 నుండి 30 రోజుల అదనపు సమయం పడుతుంది. మార్గమధ్యంలో ట్యాంకర్ల మార్పిడి, లాజిస్టిక్స్ ఇబ్బందుల వల్ల బ్యారెల్‌కు సుమారు 5 డాలర్ల మేర రవాణా వ్యయం పెరిగే అవకాశం ఉందని ఛాయిస్ బ్రోకింగ్ అంచనా వేసింది.
హార్ముజ్ జలసంధి మరియు బాబ్-ఎల్-మండేబ్ (Bab-el-Mandeb) జలసంధులు పూర్తిగా దిగ్బంధించబడితే.. ప్రపంచంలో రోజుకు సుమారు 18 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్, 5 మిలియన్ బ్యారెళ్ల పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా స్తంభించిపోతుంది. ఇతర దేశాల నుండి అత్యవసర సరఫరా అందినా కూడా మార్కెట్‌లో రోజుకు 11 నుండి 13 మిలియన్ బ్యారెళ్ల చమురు కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.
కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీస్ హెడ్ అనింద్య బానర్జీ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి ద్వారా జరుగుతున్న చమురు రవాణా సాధారణ రోజుల కంటే 80-85% తక్కువగా ఉంది. ఎర్ర సముద్రంలోనూ ఇదే తరహా మందగమనం కనిపిస్తోంది.
ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 80 డాలర్ల నుండి 100 మధ్య డాలర్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనవుతాయని కోటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. ఒకవేళ యుద్ధం ముదిరితే ఇవి 120 డాలర్లకి చేరే ప్రమాదం ఉంది. అయితే, పరిస్థితులు చక్కబడి హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభమైతే ధరలు 80 డాలర్ల కంటే తగ్గి 68 డాలర్ల నుంచి 70 డాలర్ల స్థాయికి దిగివచ్చే అవకాశముంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
