మొబైల్ వాలెట్ రూల్స్ కఠినతరం చేసిన ఆర్‌బీఐ: వినియోగదారులపై పడే ప్రభావం ఇదే!
డిజిటల్ పేమెంట్స్ రంగంలో మొబైల్ వాలెట్లను (Mobile Wallets) విరివిగా వాడే భారతీయులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. ఫోన్‌పే (PhonePe), మోబిక్విక్ (Mobikwik), అమెజాన్ పే (Amazon Pay), ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వంటి పాపులర్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (PPI) నియమాలను ఆర్‌బీఐ ఒక్కసారిగా కఠినతరం చేసింది.
కేంద్ర బ్యాంక్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంతో ఫిన్‌టెక్ పరిశ్రమ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనైంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై మొబైల్ వాలెట్లలో గరిష్టంగా రూ. 2 లక్షల బ్యాలెన్స్ మాత్రమే ఉంచాలి. అలాగే ఒకరి నుండి మరొకరికి (P2P) పంపే బదిలీల పరిమితిని నెలకు రూ. 25,000 కు తగ్గించారు. అంతేకాకుండా, ప్రతి నెలా వాలెట్‌లో క్యాష్ లోడ్ చేసుకునే లిమిట్‌ను కేవలం రూ. 10,000 గా ఫిక్స్ చేశారు.

ఆర్‌బీఐ ఇంతలా రూల్స్ ఎందుకు మార్చింది?
ఈ నిబంధనల వెనుక ఒక బలమైన కారణం ఉంది. దేశంలో నిషేధించబడిన ఆన్‌లైన్ బెట్టింగ్ (Betting), గ్యాంబ్లింగ్, , రియల్-మనీ గేమింగ్ యాప్స్ ఈ డిజిటల్ వాలెట్లను విపరీతంగా దుర్వినియోగం చేస్తున్నట్లు ఆర్‌బీఐ గుర్తించింది. కొన్ని కంపెనీలు తప్పుడు కేటగిరీల కింద మర్చంట్ అకౌంట్లు తెరిచి ఇలాంటి అక్రమ లావాదేవీలను సాగిస్తున్నాయని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU) ఆర్‌బీఐకి రెడ్ ఫ్లాగ్ (హెచ్చరిక) జారీ చేసింది.
అనుమానాస్పద లావాదేవీలు, తక్కువ ఆదాయం ఉన్న అకౌంట్లలో కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్లు జరగడం, పెద్ద మొత్తంలో డబ్బులు బదిలీ అయిన వెంటనే ఆ అకౌంట్లు ఇన్‌యాక్టివ్‌గా మారిపోవడం వంటి మోసాలను గుర్తించడంతోనే ఆర్‌బీఐ రంగంలోకి దిగింది.
బ్యాంకులు, యూపీఐలకే లాభమా?
మే 20న జరిగిన ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు ఫిన్‌టెక్ ప్రతినిధులు, మాజీ బ్యాంకర్లు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వాలెట్ల ప్రాధాన్యత తగ్గి, బ్యాంకింగ్ సిస్టమ్ , యూపీఐ (UPI) లకే ఎక్కువ అడ్వాంటేజ్ లభిస్తుందని వారు అభిప్రాయపడ్డారు.
ఫిన్‌టెక్ కంపెనీల సీఈఓల ఆగ్రహం: "మేము వందల కోట్లు ఖర్చు పెట్టి కస్టమర్లకు ఫుల్-కేవైసీ (KYC) చేసి, మర్చంట్లను ఆన్‌బోర్డ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇలాంటి ఆంక్షలు పెడితే వాలెట్ బిజినెస్‌లు ఎప్పటికీ లాభాల్లోకి రావు. కొందరు చేసే తప్పులకు పరిశ్రమ మొత్తాన్ని శిక్షించడం ఎంతవరకు న్యాయం? ఈ అక్రమాలు యూపీఐ ద్వారా కూడా జరుగుతున్నాయి కదా" అని ఒక ప్రముఖ పేమెంట్స్ సంస్థ సీఈఓ ప్రశ్నించారు.
వినియోగదారులకు ఏం మారబోతోంది?
మొబైల్ వాలెట్లను కేవలం చిన్న చిన్న పేమెంట్లు, రీఛార్జ్‌ల కోసం వాడే సాధారణ వినియోగదారులకు దీనివల్ల పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ, వాలెట్ల ద్వారా పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్‌ఫర్ చేసే వారికి , ఆన్‌లైన్ వ్యాపారులకు ఇది పెద్ద బ్రేక్ లాంటిదే.
పాలసీ కన్సెన్సస్ సెంటర్ (PCC) కో-ఫౌండర్ నిరుపమ సౌందరరాజన్ మాట్లాడుతూ, నిబంధనలు ఎప్పుడూ రిస్క్ , గవర్నెన్స్ ఆధారంగా ఉండాలి తప్ప, ఇలా లిమిట్లు పెట్టేలా ఉండకూడదని సూచించారు. అయితే, సిస్టమ్ దుర్వినియోగాన్ని అడ్డుకోవడమే ఆర్‌బీఐ ప్రధాన లక్ష్యం కాబట్టి, ఎక్కువ లిమిట్స్ కావాలనుకునే కస్టమర్లు సాంప్రదాయ బ్యాంకింగ్ ఛానెళ్లను లేదా యూపీఐని వాడుకోవడమే ఉత్తమమని ఆర్‌బీఐ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications