ఈఎంఐ మారటోరియం పొడిగింపు ఉండకపోవచ్చు.. ఎందుకంటే?
కరోనా వైరస్ నేపథ్యంలో వ్యాపారాలు లేకపోవడం, వేతనాలకోత, ఉద్యోగాలకోత వంటి వివిధ కారణాలతో మార్చి నుండి ఆగస్ట్ 31 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) లోన్ మారటోరియం వెసులుబాటును కల్పించింది. తొలుత మార్చి, ఏప్రిల్, మే నెలలకు ప్రకటించిన ఈ సౌకర్యాన్ని ఆ తర్వాత మరో 3 నెలలు జూన్, జూలై, ఆగస్ట్ వరకు పొడిగించింది. ఈ నెల 31వ తేదీతో లోన్ మారటోరియం గడువు ముగియనుంది. అయితే దీనిని పొడిగించాలని వివిధ రంగాల నుండి విజ్ఞప్తులు వస్తున్నాయి.

మారటోరియం పొడిగించాలని..
కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. వివిధ రంగాల్లో డిమాండ్ పెరగడానికి మరో ఆరునెలల నుండి ఏడాది సమయం పడుతుందని భావిస్తున్నారు. రికవరీ ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కార్యకలాపాలు కోలుకునే వరకు మారటోరియంను పొడిగించాలని కోరుతున్నాయి. అయితే ఆర్బీఐ మాత్రం అందుకు సుముఖంగా కనిపించడం లేదని అంటున్నారు. లోన్ మారటోరియం తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. అదే సమయంలో దీనిని పొడగించవద్దని బ్యాంకులు కోరుతున్నాయి.

క్రెడిట్ బిహేవియర్‌పై ప్రభావం
ఆర్బీఐ, బ్యాంకులు మారటోరియం పొడిగింపుకు ఆసక్తి చూపించకపోవడానికి పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని, కాబట్టి అవసరం లేదని వివిధ బ్యాంకుల అధినేతలు గతంలో స్పష్టం చేశారు. ఆరు నెలలకు మించి మారటోరియాన్ని పొడిగిస్తే క్రెడిట్ బిహేవియర్ పైన ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.

బ్యాంకులు ఏం చెప్పాయంటే?
HDFC చైర్మన్ దీపక్ పరేఖ్, కొటక్ మహీంద్రా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కొటక్ తదితరులు ఇప్పటికే మారటోరియంను పొడిగించవద్దని ఆర్బీఐని కోరారు. కొంతమంది అవసరం లేకపోయినప్పటికీ దీనిని ఉపయోగించుకుంటున్నారని కూడా వారు స్పష్టం చేశారు. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి వేగవంతమయ్యాయని, ఇలాంటి సమయంలో మారటోరియం వంటి తాత్కాలిక ఉపశమనాలు అవసరం లేదని చెప్పారు.


Click it and Unblock the Notifications