EMIలు కడుతున్నా మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతోందా? ఈ పొరపాట్లు చేస్తున్నారేమో చూసుకోండి!
చాలా మంది ఏమనుకుంటారంటే.. మనం తీసుకున్న లోన్ EMIలు లేదా క్రెడిట్ కార్డు బిల్లులు ప్రతి నెలా కరెక్ట్‌గా కడితే చాలు, మన క్రెడిట్ స్కోర్ అద్భుతంగా ఉంటుంది అని. కానీ, అది పూర్తిగా నిజం కాదు. ప్రస్తుతం బ్యాంకులు , లెండర్లు కేవలం మీరు డబ్బులు తిరిగి కడుతున్నారా లేదా అని మాత్రమే చూడటం లేదు. మీ అప్పుల తీరు, క్రెడిట్ వాడకం, ఇతర ఆర్థిక అలవాట్లను కూడా నిశితంగా గమనిస్తున్నారు. మీరు సకాలంలో పేమెంట్స్ చేస్తున్నా, మీ క్రెడిట్ స్కోర్ (Credit score) ను సైలెంట్‌గా దెబ్బతీసే కొన్ని అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. 'మినిమమ్ డ్యూ' ట్రాప్ (Minimum Due Trap)
క్రెడిట్ కార్డు బిల్లు వచ్చినప్పుడు చాలా మంది చేసే పెద్ద తప్పు 'మినిమమ్ అమౌంట్' మాత్రమే కట్టడం. ఇలా చేయడం వల్ల లేట్ ఫీజు పడదు కానీ, మిగిలిన బ్యాలెన్స్‌పై భారీగా వడ్డీ పడుతుంది. ఇది మీ 'క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో' (మీకు ఉన్న లిమిట్‌లో ఎంత వాడుతున్నారు అనేది) పెంచుతుంది. నిపుణుల ప్రకారం, మీ క్రెడిట్ లిమిట్‌లో 30% కంటే తక్కువ మాత్రమే వాడాలి. అంతకంటే ఎక్కువ వాడితే మీరు అప్పుల మీద ఎక్కువగా ఆధారపడుతున్నారని భావించి స్కోర్ తగ్గిస్తారు.
2. BNPL యాప్‌ల మితిమీరిన వాడకం
ఈ రోజుల్లో 'బై నౌ పే లేటర్' (BNPL) సర్వీసులు బాగా పెరిగిపోయాయి. షాపింగ్, ట్రావెల్ కోసం ఒకేసారి నాలుగైదు యాప్స్ వాడటం వల్ల మీరు 'లోన్ స్టాకింగ్' చేస్తున్నారని క్రెడిట్ బ్యూరోలు గుర్తిస్తాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితి ఒత్తిడిలో ఉందని సూచిస్తుంది, ఫలితంగా మీ స్కోర్ (Credit score) దెబ్బతింటుంది.
3. పాత క్రెడిట్ కార్డులను క్లోజ్ చేయడం
మీ దగ్గర చాలా కాలంగా ఉన్న పాత క్రెడిట్ కార్డులను వాడటం లేదని క్లోజ్ చేస్తున్నారా? అయితే అది మీ స్కోర్‌ను తగ్గిస్తుంది. పాత కార్డులు మీ క్రెడిట్ హిస్టరీ వయస్సును పెంచుతాయి. వాటిని క్లోజ్ చేయడం వల్ల మీ మొత్తం క్రెడిట్ లిమిట్ తగ్గిపోవడమే కాకుండా, మీ క్రెడిట్ ప్రొఫైల్ బలహీనపడుతుంది. వీలైనంత వరకు పాత కార్డులను నామమాత్రంగా వాడుతూ యాక్టివ్‌గా ఉంచడమే మేలు.
4. లోన్ సెటిల్‌మెంట్ (Settlement vs Closure)
డబ్బులు లేక లోన్ కట్టలేనప్పుడు బ్యాంకులు 'సెటిల్‌మెంట్' ఆఫర్ ఇస్తాయి. అంటే తక్కువ డబ్బు కట్టి అకౌంట్ ముగించడం. కానీ ఇది మీ రిపోర్టులో 'Settled' అని కనిపిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో మీకు ఏ బ్యాంక్ కూడా లోన్ ఇవ్వదు. ఎప్పుడైనా సరే 'Closed' అని వచ్చేలా పూర్తి డబ్బు కట్టడమే ఉత్తమం.
5. చిన్న తప్పులు.. పెద్ద నష్టాలు
మీ క్రెడిట్ రిపోర్టులో మీ పాన్ (PAN) నంబర్, పేరు లేదా ఫోన్ నంబర్ తప్పుగా ఉన్నా మీ స్కోర్ మారుతుంది. వేరే ఎవరిదో అప్పు మీ ఖాతాలో పడే అవకాశం ఉంది (Mixed Files). ఈక్విఫాక్స్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ ఎండీ శుభంకర్ మిశ్రా చెబుతున్నట్లుగా.. "ఆర్థిక క్రమశిక్షణ అంటే కేవలం ఈఎంఐలు కట్టడమే కాదు, మీ క్రెడిట్ రిపోర్టును నిరంతరం గమనిస్తూ లోపాలు లేకుండా చూసుకోవడం కూడా."
ప్రస్తుతం అంతా ఆటోమేటెడ్ సిస్టమ్ కాబట్టి, మీ చిన్న పొరపాటు కూడా ఫ్యూచర్‌లో మీరు తీసుకునే లోన్ల వడ్డీ రేట్లపై ప్రభావం చూపుతుంది. అందుకే కనీసం మూడు నెలలకు ఒకసారి మీ క్రెడిట్ రిపోర్టును చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండండి. ఇది మీ ఆర్థిక భవిష్యత్తుకు ఎంతో కీలకం.


Click it and Unblock the Notifications