ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్నా వెనిజులా ఎందుకు పేద దేశంగా ఉంది? అసలు కారణాలివే!
ప్రస్తుతం వెనిజులా (Venezuela) వార్తల్లో నిలుస్తోంది. అమెరికా జరిపిన వైమానిక దాడులతో ఆ దేశ రాజధాని కరాకస్ దద్దరిల్లిపోతోంది. అయితే ఈ యుద్ధ వాతావరణం పక్కన పెడితే ప్రపంచాన్ని వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న ఒకటి ఉంది. అదేంటంటే.. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం.. అత్యంత పేద దేశంగా ఎలా మారింది? అమెరికా, సౌదీ అరేబియా కంటే ఎక్కువ చమురు ఉన్నా వెనిజులా దేశానికి ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? దీని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం.

అంకెల్లో చూస్తే ఆశ్చర్యమే!
అల్ జజీరా నివేదికల ప్రకారం.. వెనిజులా దగ్గర దాదాపు 303 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి. ఇవి సౌదీ అరేబియా కంటే ఎక్కువ. సౌదీ అరేబియా దగ్గర 267 బిలియన్ బ్యారెళ్లు ఉంటే.. వెనిజులా దగ్గర 303 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి. అయితే అమెరికా వద్ద కేవలం 55 బిలియన్ బ్యారెళ్లు మాత్రమే ఉన్నాయి. అమెరికా కంటే 5 రెట్లు ఎక్కువ చమురు ఉన్నప్పటికీ.. 2023 లో వెనిజులా చమురు ఎగుమతుల ద్వారా సంపాదించింది కేవలం 4.05 బిలియన్ డాలర్లు మాత్రమే. అదే సమయంలో సౌదీ అరేబియా 181 బిలియన్ డాలర్లు, అమెరికా 125 బిలియన్ డాలర్లు సంపాదించాయి.
చమురు ఉన్నా.. అమ్మడం ఎందుకు కష్టం?
వెనిజులా పేదరికానికి మొదటి కారణం అక్కడి చమురు నాణ్యత. 'ఒరినోకో బెల్ట్' లో దొరికే ఈ చమురును 'హెవీ క్రూడ్ ఆయిల్' (Heavy Crude Oil) అంటారు. ఇది చాలా చిక్కగా, జిగటగా ఉంటుంది. దీని రిఫైనింగ్ చాలా కష్టం. ఈ చమురును భూమి నుంచి తీయడం, శుద్ధి చేయడం చాలా ఖరీదైన పని. అలాగే సల్ఫర్ సమస్య కూడా ఉంది. అంటే ఇందులో సల్ఫర్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తొలగించడానికి అధునాతన సాంకేతికత కావాలి. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో వెనిజులా చమురుకు తక్కువ ధర వస్తుంది.
నిర్వహణ లోపం, అవినీతి
కేవలం చమురు నాణ్యత మాత్రమే కాదు, ప్రభుత్వ అసమర్థత కూడా దేశాన్ని ముంచేసింది. వెనిజులా ప్రభుత్వ చమురు సంస్థ 'PDVSA'లో రాజకీయ జోక్యం, అవినీతి పెరిగిపోయాయి అన్న వ్యాఖ్యలున్నాయి. మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెట్టకపోవడంతో పాత యంత్రాలతో ఉత్పత్తి తగ్గిపోయింది. దీనికి తోడు అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు ఆ దేశ ఆర్థిక వెన్నెముకను విరిచేశాయి.
ఒక గుణపాఠం
వెనిజులా కేస్ స్టడీని బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే..సహజ వనరులు ఉండటం ఒక్కటే దేశాన్ని ధనిక దేశంగా మార్చదు. వాటిని సద్వినియోగం చేసుకునే సాంకేతికత, సమర్థవంతమైన నాయకత్వం లేకపోతే ఎంత 'నల్ల బంగారం' ఉన్నా అది శాపంగానే మారుతుంది. వెనిజులా (Venezuela) దగ్గర అరుదైన సహజ నిల్వలు ఉన్నప్పటికీ అక్కడి ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఆ దేశం వాటివల్ల లాభపడలేకపోయింది. ఇక దీంతోపాటు ఇప్పుడు అమెరికా దాడులతో ఆ దేశం మరింత పతనం వైపు వెళ్లేలా కనిపిస్తోంది. మరి మున్ముందు వెనిజులా ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications