విదేశాల నుంచి టన్నుల కొద్దీ బంగారం ఇండియాకు.. ఆర్బీఐ ఈ పసిడిని రహస్యంగా ఎక్కడ దాచిపెడుతోందంటే..
Why Is RBI Bringing Gold Back to India? అంతర్జాతీయంగా తీవ్రమవుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాల భయాలు, గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తన బంగారు నిల్వలను విదేశాల నుండి స్వదేశానికి తరలించే వ్యూహాత్మక ప్రక్రియను మరింత వేగవంతం చేసింది.
సెప్టెంబర్ 2026తో ముగిసిన ఆరు నెలల కాలంలోనే ఆర్‌బిఐ దాదాపు 60 టన్నుల బంగారాన్ని విదేశీ ఖజానాల నుండి అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన భద్రత నడుమ భారతదేశానికి తీసుకువచ్చింది. ఈ తాజా తరలింపుతో రిజర్వ్ బ్యాంక్ మొత్తం బంగారు నిల్వలలో స్వదేశంలో ఉన్న బంగారం వాటా ఏకంగా 84 శాతానికి చేరుకోవడం ఆర్థిక వర్గాలలో చర్చనీయాంశమైంది.

తాజా గణాంకాల ప్రకారం, ఆర్‌బిఐ వద్ద ప్రస్తుతం మొత్తం 880.5 టన్నుల బంగారు నిల్వలు ఉండగా.. ఇందులో 740.13 టన్నులు భారతదేశంలోనే నిల్వ ఉన్నాయి. మిగిలిన 140.4 టన్నుల బంగారం (మొత్తం నిల్వలలో సుమారు 16 శాతం) లండన్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో ఉన్న బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ (BIS) వంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కస్టోడియన్ల సంరక్షణలో ఉంది.
అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో తక్షణ ఆర్థిక లావాదేవీలు జరపడానికి.. స్వాప్ ఒప్పందాలకు, విదేశీ మారక నిల్వల నిర్వహణలో సౌలభ్యం కోసం కొంత భాగాన్ని విదేశాలలో ఉంచడం ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు అనుసరించే సాధారణ విధానమే అని చెప్పుకోవచ్చు.
స్వదేశానికి తరలించిన బంగారాన్ని.. ఆర్‌బిఐ ప్రధానంగా ముంబై, నాగ్‌పూర్ నగరాలలోని అత్యంత భద్రత గల భూగర్భ ఖజానాలలో భద్రపరుస్తోంది. ఆర్‌బిఐ ప్రధాన కార్యాలయం ఉన్న ముంబైతో పాటు దేశ భౌగోళిక మధ్యభాగంలో ఉండి వ్యూహాత్మకంగా అత్యంత సురక్షితమైన నాగ్‌పూర్ ఖజానాలలో కఠినమైన ఆడిట్ నిబంధనలు, బయోమెట్రిక్ పరిమిత ప్రవేశం, బహుళ అంచెల భద్రతా ప్రమాణాల నడుమ ఈ నిల్వలను నిర్వహిస్తున్నారు.
జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఖజానాల ఖచ్చితమైన స్థానాలు, రవాణా మార్గాలు, భద్రతా ఏర్పాట్లను కేంద్ర బ్యాంక్ పూర్తిగా గోప్యంగా ఉంచుతుంది. ఇంత భారీ పరిమాణంలో బంగారాన్ని విమానాల ద్వారా సురక్షితంగా తరలించడానికి ప్రత్యేక రవాణా విమానాలు, అత్యున్నత స్థాయి భద్రతా సిబ్బంది సమన్వయంతో పనిచేశారు.
ఇటీవలి కాలంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యా విదేశీ మారక, బంగారు నిల్వలను స్తంభింపజేయడం ప్రపంచవ్యాప్తంగా అనేక కేంద్ర బ్యాంకులకు ఒక హెచ్చరికగా మారింది. అదనంగా అమెరికా వాణిజ్య సుంకాల హెచ్చరికలు, డాలర్ ఆధిపత్యంపై పెరుగుతున్న చర్చల నేపథ్యంలో ప్రపంచ కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను స్వదేశీ ఖజానాలలోనే ఉంచుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి.
విదేశీ కస్టోడియన్లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం, నిల్వల భద్రతను వైవిధ్యపరచడం, అంతర్జాతీయ సంక్షోభాలు, కరెన్సీ అస్థిరత సమయాల్లో విలువైన జాతీయ ఆస్తులపై సంపూర్ణ సార్వభౌమ నియంత్రణ కలిగి ఉండటమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఈ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలలో తీవ్ర ఒడిదుడుకులు నెలకొన్నప్పటికీ.. దీర్ఘకాలిక ఆర్థిక భద్రత దృష్ట్యా భారత్ విదేశీ మారక నిల్వలలో బంగారం అత్యంత కీలక రక్షణ కవచంగా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications
